లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత అల్ రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో భారత్ ఓడిపోతుందని అనుకున్న తరుణంగా జడేజా పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత్ కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జడేజాపై పలువురు సీనియర్లు విమర్శలు కూడా చేశారు. జడేజా ఇంకాస్త వేగంగా ఆడి ఉంటే బాగుండేది అని వాళ్లు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
టెస్టు క్రికెట్‌లో జడేజా అత్యుత్తమ ఆల్ రౌండర్ అని కొనియాడాడు. టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పొలుస్తూ.. జడేజాను ప్రశంసిస్తూనే.. ఇంకాస్త వేగంగా ఆడి ఉంటే బాగుండేదని అన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ కంటే జడేజానే ఎక్కువ పరుగులు చేశాడని రైనా (Suresh Raina) అన్నాడు. ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీల సంఖ్యలో మాత్రమే వ్యత్యాసం ఉందని.. కానీ ప్రపంచంలోనే జడేజా అత్యుత్తమ ఆల్ రౌండర్ అని పేర్కొన్నాడు.
‘‘లార్డ్స్ టెస్టులో మనం 100 పరుగుల తేడాతో ఓడిపోతాం అనుకున్నాం. కానీ, జడేజా పట్టుదలతో ఆఖరి వరకూ పోరాడిన తీరు అద్భుతం. అయితే జడ్డూ ఇంకాస్త రిస్క్ తీసుకొని ఉంటే బాగుండేది. బుమ్రా క్రీజ్‌లో ఉన్న సమయంలో ఆ అవకాశం ఉండేది. కొన్ని ఫోర్లు, సిక్సులు కొడితే విజయ లాంఛనం పూర్తి చేసేవాడేమో’’ అని రైనా పేర్కొన్నాడు. ఇక భారత్ ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా ప్రారంభం కానుంది.