రేవంత్ ప్రభుత్వ చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారి గ్రామాల్లో పారిశుద్ద్యం పడకేసిందన్న సంగతిని ప్రజలకు చెప్పాలని కెటిఆర్ పార్టీ నేతలకు చెప్పారు. బిసిలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేని కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న డ్రామాలను ప్రజలకు విడమిరిచి చెప్పాలని పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ రంగాలకు డిక్లరేషన్‌ల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయా రంగాలను మోసం చేసిన తీరును వివరించాలని అన్నారు. వృద్దులకు పెంచుతానన్న 4 వేల రూపాయల పెన్షన్‌తో పాటు ఆడబిడ్డలకు నెలకు
ఇస్తానన్న 2500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహాలను విడమరిచి చెప్పాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఈ వారంలోనే ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరిగేలా చూడాలని కెటిఆర్ తెలిపారు.