ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే
బాధ్యత మీదే నిరంతరం గ్రామాలకు
వాతావరణశాఖ సమాచారం
చేరవేయండి మూడు గంటల ముందే
రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలి
ఏజెన్సీ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో
ముందస్తు జాగ్రత్తలు హైదరాబాద్‌లో
150 సహాయక బృందాలు ఈనెల 25
నుంచి ఆగస్టు 10 వరకు మండల
కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ
రాష్ట్రంలో ఎరువులకు కొరత లేనేలేదు
స్టాక్ వివరాలు బోర్డుపై డిస్ప్లే చేయాలి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వర్షాల నేపథ్యం లో జిల్లా కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాల ని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం స చివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమం త్రి వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువ నమోదైనప్పటి కి, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.వాతావరణ సూచనలకు అనుగుణం గా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీమ్‌లను పంపించడం జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు ఫీల్డ్ లో హైదరాబాద్ నగరం లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం తో పనిచేయాలన్నారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జ రిగే నష్టాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసేలా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. దీంతో కనీసం మూడు గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుకలుగుతుందని చెప్పారు.
ఏజెన్సీల్లో ముందస్తు జాగ్రత్తలు
ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్సి)ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్లు ఫీల్డ్‌లో పర్యటించాలి
జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయాలని, కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను గుర్తించి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విధుల నిర్వహణలో ఎంతటి అధికారులైనప్పటికీ అజాగ్రత్తగా ఉంటే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి రోజు కలెక్టర్ల తమ కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టు అందించాలని సీఎస్ ను ఆదేశించారు.
ఎరువుల స్టాక్ డిస్ప్లే చేయాలి
రైతుల కంటే ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉండే రైతులు, ప్రజలు గుర్తించే విధంగా ప్రతి ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలని, ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లుగా కొందరు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కావాల్సినంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డుకు విలువ పెరిగింది
ఉచిత సన్న బియ్యం పంపిణీతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ కూడా పెరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాలని సిఎం ఆదేశించారు. శాసనసభ్యులు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని తెలిపారు.
ప్రణాళిబద్ధ్దంగా నీటి వినియోగం
జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. నీటి నిల్వలను అంచనా వేసుకుంటూ వర్షాలకు అనుగుణంగా నీటి వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువులు, కుంటలకు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైందన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలని, గత ఏడాది రికార్డు స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.