Tuesday, July 22, 2025

జిఒ 49 నిలిపివేత

- Advertisement -
- Advertisement -

సిఎం ఆదేశాలతో అటవీశాఖ
ఉత్తర్వులు కొమురంభీం
టైగర్ కన్జర్వేషన్ రిజర్వు
ఏర్పాటుపై స్థానికంగా తీవ్ర
వ్యతిరేకత నేపథ్యంలో
ప్రభుత్వం నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49 అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం సోమవారం మోమో జారీ చేశారు. జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశించడం పట్ల పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్, ఇతర నేతలతో కలసి మంత్రి సీతక్క ముఖ్యమంత్రిని సచివాయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ జివోను రద్దు చేయాలని కోరుతూ జివో విడుదలైన నాటి నుంచే పెద్ద ఎత్తున ఆదివాసీలు, గిరిజనులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీంతో ప్రజావ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జివో అమలును నిలిపివేస్తూ ఆదేశించింది.

ఇవీ వివాదాస్పద 49 జివోలోని అంశాలు
తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వలను కలిపేందుకు వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్‌గా ఏర్పాటు చేయాలని 2016లోనే బిఆర్‌ఎస్ పాలనలో బీజం పడింది. 2016 జూన్ 12న దీనికి గత ప్రభుత్వం అంకుర్పార్పణ చేసింది. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మొదటి సమావేశంలో ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించాలనే ప్రతిపాదనపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్చించింది. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 27న రాష్ట్రవన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్ కోసం అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2018 జూన్ 26న ఛీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతిపాదిత ప్రాంతాన్ని వన్యప్రాణులు అభయారణ్యంగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2019 జూలై 11న కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్‌కు అనుబందంగా ప్రతిపాదితక ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించారు.

ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ గుడెం నగేష్, బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మద్దతుతో 2024 జూలై 10న రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్దం చేసింది. తదనుగుణంగా తడోబా టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వలను కలిపేలా వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్సర్వేషన్ రిజర్వ్‌గా ఏర్పాటు చేస్తూ జీవో 49ని జారీ చేసింది. అయితే ఈ జోవో పట్ల స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్‌లో ఈ ఏడాది జూన్ 10న సమావేశమై జీవో 49ను నిలిపి వేయాలని తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కలిసి స్థానిక ప్రజల ఆకాంక్షలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క అటవీ అధికారులు,

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో ఈ ఏడాది జులై 3న సమావేశమై మరో సారి చర్చించి జీవో 49ని నిలుపు దల చేయాలని కోరాలని నిర్ణయించారు. ఈ జివోలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యా ణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్‌లలో 1.49 లక్షలహెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ప్రభుత్వం పేర్కొంది. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం జరిగిన మంత్రుల సమావేశంలో ఇందుకు అనుగుణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి జీవోను నిలిపుదల చేసేలా ఒప్పించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో స్థానిక కలెక్టర్ నుంచి మరొకసారి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని జీవో 49ని నిలుపుదల చేస్తూ మోమోను జారీ చేసింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఆదివాసీలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News