కులవృత్తులను కాపాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ, కులవృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆదాయం వచ్చే కులవృత్తులను నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. లిక్కర్ మాఫీయాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కల్లు దుకాణాలు బంద్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కల్లు కంపౌండ్ బంద్ చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయం అని, మళ్లీ కెసిఆర్ సిఎం కాగానే కల్లు దుకాణాలను తెరిపిస్తామని చెప్పారు.
తెలంగాణ భవన్లో సోమవారం బిఆర్ఎస్ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, గట్టు రాంచందర్ రావు,నాగేందర్ గౌడ్లతో కలిసి మీడియా మాట్లాడారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల పొలం ఇస్తామని, చెట్లపై నుంచి పడి చనిపోతే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కల్లు కంపౌండ్ను నిషేధిస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తోందని, లిక్కర్ కంపెనీల కమీషన్లకు కక్కుర్తిపడి, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కల్తీ పాలు అరిటకట్టడంపై ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు.