Wednesday, July 23, 2025

నాయకులూ రిటైర్ కావలసిందే!

- Advertisement -
- Advertisement -

సమాజంలో వయసు పైబడిన వారు కుటుంబం, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొని తమ వారసులకు, ఇతరులకు అప్పచెప్పడం సహజంగా జరిగే పని. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, సభ్యులు నిర్ణీత వయస్సు పరిమితితోనే పదవీ విరమణ చేస్తున్నారు. దేశంలో లోక్‌సభ సభ్యులు, రాష్ట్రాలలో శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి 25 సంవత్సరాలు అర్హతగా ఉంది. రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనమండలి సభ్యులుగా ఎంపిక కావడానికి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలలో చట్టసభలకు ఎన్నిక కావడానికి, చట్టసభల సభ్యత్వం ద్వారా వచ్చే వివిధ పదవులు చేపట్టడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలు ఆయా రాజ్యాంగాలలో ప్రస్తావించబడలేదు.

భారతదేశంలో అతిపెద్ద వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మొరార్జీ దేశాయి. 1977లో భారత ప్రధాన మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ వయసు (Morarji Desai’s age) 81 సంవత్సరాలు. 1984లో ఇందిరా గాంధీ మరణాంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్ గాంధీ వయసు 40 ఏళ్లు. దేశంలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఎన్నికై తన పనితీరుతో యువత రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణగా నిలిచాడు. రాజీవ్ గాంధీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన తీరుతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా ఎన్నికైన సందర్భాలలో వీరి వయసుకు సంబంధించి సర్వత్రా చర్చ జరిగింది. రాజీవ్ గాంధీ తదనంతరం రాజకీయ నాయకుల వయసుకు సంబంధించిన అంశానికి ప్రాధాన్యత లేకుండాపోయింది.

2014లో దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటి వరకు రాజకీయ నాయకుల వయోపరిమితి పై చర్చ జరుగుతూనే ఉంది.ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజకీయ నాయకుల పదవీ విరమణ వయసుపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగ సంచలనానికి కేంద్రబిందువుగా నిలిచాయి. దేశంలో రాజకీయ నేతలు 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ తీసుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. నాగపూర్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరో పంత్ పింగ్లి కి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడిన మాటలపట్ల దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. 75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలని, పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అంటూ గతంలో మొరోపంత్ పింగ్లి మాట్లాడిన మాటలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ పేర్కొన్న వైనం పలువురిని దిగ్భ్రాంతి పరిచింది.

మోహన్ భగవత్ మాట్లాడిన మాటల పట్ల కమలనాథులలో అంతర్మథనం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బిజెపిల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిజెపి అధ్యక్షుడు నడ్డా మాట్లాడిన మాటలు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆగ్రహం తెప్పించాయి. ప్రస్తుత పరిస్థితులలో బిజెపి బాగా పటిష్టపడిందని తన వ్యవహారాలను తానే నిర్వహించుకునే శక్తిసామర్ధ్యాలు పార్టీకి ఉన్నాయని నడ్డా చెప్పిన మాటలు ఆర్‌ఎస్‌ఎస్ కు బిజెపికి మధ్య ఆగాదాన్ని పెంచాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు బిజెపిలో తీవ్ర దుమారం లేపాయి. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, ఇతరులకు ఎలాంటి హానిని కలిగించక తన పని చేసుకుంటూ ముందుకు సాగుతాడని మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు బిజెపిలో ఆందోళన రేకెత్తించాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 17 తో ప్రధాని మోడీకి 75 ఏళ్లు, సెప్టెంబర్ 11 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు కూడా 75 ఏళ్లు నిండుతున్న తరుణంలో మోహన్ భగవత్ మాటలు ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడారా? లేక తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారా? అన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతున్నాయి. ఇరువురు నేతలు కూడా తమ పదవుల నుంచి వైదొలిగి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మోహన్ భగవత్ నాగపూర్ లో ఏలికల పదవీ విరమణ పై మాట్లాడిన నాడే మరో కార్యక్రమంలో అహ్మదాబాద్‌లో అమిత్ షా మాట్లాడుతూ తాను రిటైర్ అయ్యాక వేదాలు, ఉపనిషత్తులు చదవడానికి, ప్రకృతి సేద్యం చేయడంలో తన శేష జీవితాన్ని గడుపుతానని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారాయి.

1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన బిజెపిని 1989 లోక్‌సభ ఎన్నికలలో 85 సీట్లకు, 1991 ఎన్నికల నాటికి 120 సీట్లకు పెంచి 1996 ఎన్నికల్లో 161 సీట్లలో విజయం సాధించి తొలిసారి అధికార పీఠం సాధించడంలో కీలకమైన పాత్ర అద్వానీదే. 1999 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 182 సీట్లు గెలిచి ఐదేళ్లపాటు వాజ్‌పేయి ప్రధానిగా సుస్థిర ప్రభుత్వం ఏర్పరచటంలో అద్వానిదే ప్రధాన భూమిక. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలలో ఎల్‌కె అద్వానీ నాయకత్వం లో పోటీ చేసిన బిజెపి మెజారిటీ సాధించకపోవడంతో ప్రధానమంత్రి పదవిని చేపట్టలేకపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల కోసం 2013లోనే ప్రచార కమిటీ చైర్మన్ గా నరేంద్ర మోడీ ఎన్నిక కావడం జరిగింది. మోడీ, అమిత్ షా ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్ అండతో అద్వానీని పోటీ నుంచి తప్పించడానికి వయసు నిబంధన అస్త్రాన్ని ఉపయోగించారు.

రాజకీయ చాణక్యంతో 75 ఏళ్లు దాటిన వాళ్లకు బిజెపిలో ఎలాంటి కీలకపదవులు ఇవ్వరాదనే నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు.బిజెపిలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషికి వయసును సాకుగా చూపెట్టి స్థానం కల్పించలేదు. అదేవిధంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా వారికి చోటు కల్పించలేకపోవడంతో బిజెపిలో వారి వర్గం నిరసన తెలియజేయడం జరిగింది. మార్గదర్శక మండలి అనే కొత్త వ్యవస్థను తెరపైకి తెచ్చి అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకు స్థానం కల్పించిన అది ఏనాడు సమావేశమైన దాఖలాలు లేవు.

గతంలో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎల్‌కె అద్వానీ, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషిలకు 2014 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 75 సంవత్సరాల నిబంధన సాకుతో క్యాబినెట్‌లో అవకాశం కల్పించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషిల వయసు ప్రాతిపదికగా అభ్యర్థిత్వాలను బిజెపి ఖరారు చేయలేదు. 2014లో బిజెపిలో తమకు అడ్డు లేకుండా చేసుకోవడానికి ఉపయోగించిన వయసు నిబంధన అస్త్రం నేడు తమ మీదకే దూసుకొస్తున్న ప్రమాదాన్ని మోడీ, అమిత్ షాలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. పార్టీ ప్రథమం, వ్యక్తులు ద్వితీయం అన్న సిద్ధాంతం ఏ రీతిన పయనం సాగిస్తుందో కాలమే సమాధానం చెబుతుంది.

ప్రస్తుత పరిస్థితులలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అన్ని పార్టీలలో ఉన్న యువ నాయకత్వానికి భరోసానిస్తున్నాయి. చట్టసభల సభ్యత్వం, వాటి ఆధారంగా వివిధ పదవులను చేపట్టే వారికి వయసు నిబంధన లేకపోవడంతో కాటికి కాళ్లు చాపె నాటికి కూడా పదవులపై నాయక గణానికి ఆశలు సన్నగిల్లడం లేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) లెక్కల ప్రకారం ప్రస్తుత లోక్‌సభలో 76 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పైబడిన వారు 11 మంది, 66- 75 సంవత్సరాల మధ్య వయసు గలవారు 94 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ పదవులలో ప్రవేశించడానికి, చట్టసభలలో పోటీ చేయడానికి గరిష్ట వయోపరిమితికి సంబంధించిన నైతిక నిబంధనను పార్టీ సిద్ధాంతాల్లో పెట్టుకోవాలి. అప్పుడే యువతకు, రాజకీయాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి అవకాశాలు సృష్టించబడి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి 94409 66416
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News