Wednesday, July 23, 2025

మహారాష్ట్రలో గోరక్షకుల ‘పశుత్వం’

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో పశువుల రవాణా, మాంసం వ్యాపారంపై గోరక్షకుల దాడులు తీవ్రమవుతుండడం ఆందోళనలకు దారితీస్తోంది. ఈ దాడులు భరించలేక మొత్తం పశువుల వ్యాపారాన్నే సోమవారం (జులై 21) నుంచి బహిష్కరించడానికి వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ బహిష్కరణ మూడు లక్షల మంది వ్యాపారులపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. పశువులు కొనడం, విక్రయించడం వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. అందువల్ల రైతులపై కూడా దీని ప్రభావం పడుతుంది. గోరక్షకులనుండి రక్షణ కోరుతూ పశుమాంస వ్యాపార సంఘం ప్రతినిధులు రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్‌ను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మిశుక్లాను కలుసుకుని విజ్ఞప్తి చేశారు.

దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వారు మౌఖికంగా హామీ ఇచ్చారు. మహారాష్ట్ర జంతు సంరక్షణ చట్టం 1976కు 2015లో సవరణ జరిగిన తరువాత గోరక్షకుల దారుణాలు (Atrocities cow vigilantes) విపరీతంగా పెరిగాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సవరించిన చట్టం ప్రకారం గేదెలను వధించడానికి, పశువైద్యుడి నుండి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం. గేదె వట్టిపోయిందని, చూలుకు కూడా పనికి రాదని ధ్రువీకరించాకనే వ్యాపారానికి, కబేలాకు అనుమతి లభించే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ విధంగా సర్టిఫికెట్ ఉన్నప్పటికీ గోరక్షకుల దాడులు ఆగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. సవరించిన చట్టంలో సెక్షన్ ఎ ప్రకారం రాష్ట్రంలో మేకలు, గొర్రెలు, గేదెలు, ఇతర పశువుల రవాణాలకు ఎటువంటి పరిమితి లేదు.

అలాగే వధించడానికి, మాంసం విక్రయించడానికి కూడా ఆంక్షలు లేవు. అయినా గోరక్షణ ముసుగులో వ్యాపారులను దోచుకుంటున్నారని ఔరంగాబాద్ లోని వ్యాపారి షిరాజ్ ఖురేషి ఆరోపించారు. పశువుల రవాణా వాహనాలను ఆపి డ్రైవర్లపై దాడిచేయడం, పశువులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం జరుగుతోందని ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో మేనెలలో అమరావతి జిల్లాలోని బద్నేరా నుంచి వాషిమ్‌కు పశువుల వ్యాపారి మహ్మద్ సుఫియాన్ గేదెలను తరలిస్తుండా, స్థానిక పోలీసుల సహాయంతో గోరక్షకులు దాడి చేశారు. గేదెలను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖవతి (కస్టడీలో ఉన్న జంతువుల నిర్వహణ చెల్లింపు)కింద రూ. 65,000 సుఫియాన్ చెల్లించినా ఇంకా అతనికి గేదెలను అప్పగించకపోవడం గమనార్హం.

దీనిపై ఆగస్టులో కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. సుఫియాన్ కుటుంబం పశువుల వ్యాపారంపైనే ఆధారపడి బతుకుతోంది. సుఫియాన్, ఆయన తండ్రి లైసెన్సు పొందిన వ్యాపారులే. సుఫియాన్‌కు కబేళా వ్యాపారం లేకపోయినా దాడులు, ఒత్తిడులు తప్పడం లేదు. ముస్లిం ఖరేషీ కమ్యూనిటీకి చెందిన అనేక మంది ఇతర వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పశువుల వ్యాపారులైనా, కసాయిదారులైనా సరే బజరంగ్‌దళ్ సభ్యులతో సహా గోరక్షణ సంఘాలు గత కొన్నేళ్లుగా వేధిస్తున్నాయని వీరు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో 21 నుంచి పూర్తిగా తమ వ్యాపారాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారుల సంఘం ఆల్ ఇండియా జమియతుల్ (ఎఐజెక్యు) కి చెందిన షబీర్ ఖరేషి చెప్పారు.

విదర్భ, మరాట్వాడా, పశ్చిమ మహారాష్ట్రతోసహా అనేక ప్రాంతాల్లోని సభ్యులతో ఎఐజెక్యు సమావేశాలు నిర్వహించింది. 2023 లో గోరక్షకుల దాడులను భరించలేక హర్యానాలోని మేవత్ గ్రామానికి చెందిన 200 మంది పశువుల వ్యాపారులు తమ వృత్తిని వదులుకున్నారు. గోరక్షణ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టి హింసాకాండకు పాల్పడడంతో పశువుల వ్యాపారం ప్రాణాంతకంగా పరిణమించింది. హర్యానాలోని నూహ్ జిల్లా అంతా ఈ దారుణాలకు బలైంది. చట్టపరంగా తాము ఇతర రాష్ట్రాలకు పశువులను రవాణా చేస్తున్నా గోరక్షకుల హింసాకాండ మితిమీరిపోతోందని వాపోయారు. దీనికి తోడు పశువులు రవాణా వాహనం ఒక్కింటికి గోరక్షకులు రూ. 3000 నుంచి రూ. 4000 వరకు డిమాండ్ చేస్తుండగా, పోలీసులు కూడా తమ నుంచి 2000 నుంచి 3000 వరకు లంచాలు పిండుతున్నారని ఆరోపించారు.

ఇది రానురాను ట్రిప్పుకు రూ. 6000 నుంచి రూ. 7000 వరకు డిమాండ్ పెరిగిందని, ఇవన్నీ భరించలేక పశువుల వ్యాపారానికి స్వస్తి చెప్పామని మేవత్ గ్రామ వ్యాపారులు స్పష్టం చేశారు. మేవత్‌లో పది లక్షల మంది ఉండగా, వారిలో 70 శాతం మంది ముస్లింలే. ముస్లింలకు వ్యవసాయ భూములు కానీ, ఇతర జీవనాధారాలు కానీ లేక పశువ్యాపారంపైనే గత 150 ఏళ్లుగా వీరు జీవిస్తున్నారు. గోరక్షకుల అక్రమాలపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వారు దాడులతో స్వాధీనం చేసుకున్న పశువులకు ఆశ్రయం కల్పించలేక అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. తాము అధికారికంగా తనిఖీ చేయడానికి హక్కు ఉందని నకిలీ గుర్తింపు కార్డులు చూపించి బెదిరిస్తున్నారు.

ఈ హింసాకాండ హర్యానా నుంచి రాజస్థాన్‌కు కూడా వ్యాపించింది. 2017 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు తమ వట్టిపోయిన పశువుల రవాణా, కబేళాలకు తరలింపు, మాంస విక్రయాలను నిషేధిస్తూ మే 25న ఉత్తర్వులు జారీ చేసింది. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి సాహసించలేదు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తం మీద రూ. లక్ష కోట్ల విలువైన మాంసం పరిశ్రమ ఒడిదుడుకులకు గురైంది. దీనిపై పశువుల వ్యాపారులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిని సుప్రీం కోర్టు బలపర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News