Thursday, July 24, 2025

బిసి బిల్లుపై కలిసి రావాలి

- Advertisement -
- Advertisement -

బీసీ బిల్లుకు పార్లమెంటులో….అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం
జాతీయ స్థాయిలో కులగణన తెరపైకి రావడంలో తెలంగాణదే కీ రోల్
తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలు
ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నాం
10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు అన్నీ గాలికి వదిలేశారు
నిబద్ధత ఉంది కాబట్టి ప్రణాళికా ప్రకారం ముందుకు వెళుతున్నాం
రామచందర్ రావు నోటీసులకు భయపడేది లేదు
విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందకెళ్తామని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో భట్టి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, ఈ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆయన చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో పవర్‌లోకి రాగానే కుల గణన నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదట కులగణన వద్దని దబాయించినా, తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి దేశవ్యాప్త జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కులగణన సర్వేను చాలా పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించామని అందుకే తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు. తెలంగాణ జరిగిన విధానమే దేశవ్యాప్తంగా అమలు కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుల గణన నివేదికను కేబినెట్, శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశంలోనే చరిత్రాత్మకంగా మారిందన్నారు. కులగణనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలు : కులగణన సర్వే అవసరం లేదన్న మోడీని జన గణనతో పాటు కుల గణన కూడా చేస్తామని నిర్ణయం తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా, విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకి ముందు సర్వేకి తర్వాత అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే చారిత్రాత్మకమైనదని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని వెల్లడించారు.

బీసీ బిల్లును త్వరితగతిన పార్లమెంట్లో ప్రవేశపెట్టి మద్దతు కూడగట్టడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం .. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా కలిసి వస్తారన్నారు. కుల గణన లో తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని, దేశంలోని ఏ రాష్ట్రం అయినా కుల గణన చేపట్టాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరించాల్సిందేనని భట్టి పునరుద్ఘాటించారు. గతంలో దేశంలో చేపట్టిన వివిధ రకాల సర్వేలు, వారి అనుభవాలు పరిగణలోకి తీసుకున్నామని, సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి తయారీ విధానం, జిల్లా, రాష్ట్రస్థాయిలో భాగస్వాములు అందర్నీ సర్వేకు ముందే సమావేశపరిచి వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్ళామన్నారు. ప్రతి 150 ఇళ్లకు ఒక బ్లాక్, ప్రతి బ్లాక్ కు ఒక అధికారిని నియమించామని, పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వే జరిగిందని తెలిపారు. సమాచారం సేకరించిన విధానం, సేకరించిన డాటాను క్యాబినెట్లో, అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేశామని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలను స్వతంత్ర అనుభవజ్ఞుల కమిటీతో కలిసి విశ్లేషణ చేయించామని, పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని అన్నారు.

గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నాం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు అసెంబ్లీలోనే బిజెపి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారని, అలాగే పార్లమెంట్ లోను పార్టీలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ను తొలగించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని ఆర్డినెన్స్ తీసుకు వచ్చామని, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఈ పద్ధతిలో కుల గణన జరగలేదన్నారు. తెలంగాణ చేపట్టిన కుల గణన దేశానికి దిశా నిర్దేశం చేసిందని, కుల గణనకు సంబంధించి కేంద్రం ఏ సమాచారం అడిగిన ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కుల గణన విషయంలో అన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనేందుకు ఒక పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని, పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాయని, పార్లమెంట్లో అందుకు భిన్నంగా ఆయా పార్టీలు స్పందిస్తాయని అనుకోవడం లేదన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు అన్నీ గాలికి వదిలేశారు.. మాకు నిబద్ధత ఉంది కాబట్టి ప్రణాళికా ప్రకారం ముందుకు వెళుతున్నామని చెప్పారు. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు.

రామచందర్ రావు నోటీసులకు భయపడేది లేదు:

బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు నోటీసులకు భయపడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నోటీసులు అందిన తరువాత ఏవిధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. రామచందర్ రావుకి దళితులన్నా, బడుగు బహీన వర్గాలన్నా చిన్న చూపని విమర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచందర్ రావు కూడా కారణమని ఇటీవల భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రివార్డుగా బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్ పదవి ఇచ్చిందని ఆరోపించారు.

రామచందర్ రావుకు తెలంగాణ చీప్ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరడంతో భట్టి వ్యాఖ్యలను తప్పుబట్టిన రామచందర్ రావు తన న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని రామచందర్ రావు నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు ఉందని, దేశంలో ఈ వర్గాలకు మేలు జరుగుతుంటే ఆయన పదేపదే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రామచంద్ర రావు పాత్ర ఏంటో అందరికీ తెలుసని అన్నారు. రిజర్వేషన్ల బిల్లు తామే తెచ్చామని, తామే పరిష్కరించుకోవాలని బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారని, వారు విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేదని భావిస్తున్నానన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అనేది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశం అని, రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News