Wednesday, July 23, 2025

ఆ మూడున్నర గంటలు ఏం జరిగింది?

- Advertisement -
- Advertisement -

ధన్‌ఖడ్ రాజీనామా వెనుక జవాబు లేని ప్రశ్నలెన్నో
సోమవారం మధ్యాహ్నం 1 నుంచి 4.30 గంటల మధ్య జరిగిన పరిణామాలపై ముసురుకుంటున్న సందేహాలు
జస్టిస్ వర్మ ఎపిసోడే ధన్‌ఖడ్ పదవికి గండం తెచ్చిందా?
విపక్షాల నోటీసును అనుమతించి అధికారపక్షం ఆగ్రహానికి గురైన ఉపరాష్ట్రపతి
బిఎసి భేటీకి బిజెపి మంత్రుల డుమ్మా
బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడానికే తప్పించారా?

న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా చేసిన రాజీనామా రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. అనారోగ్య సమస్యలను ఆయన ప్రధాన కారణంగా చెబుతున్నప్పటికీ దానికి వెనక ఇంకేదో బలమైనది ఉందన్న చర్చ జరుగుతోంది. రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ధన్‌ఖడ్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ఒక పక్క విపక్షాలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. మరో పక్క అధికార కూటమి నేతలు మౌనం వహిస్తున్నారు. కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. ఈ క్రమంలో ధన్‌ఖడ్ రాజీనామా చేయడం, ఆయన వారసుడిగా బీహార్‌కు చెందిన ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి కల్పించడానికి ఒత్తిడి వచ్చి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నీతీశ్ కుమార్‌ను తదుపరి ఉపరాష్ట్రపతిగా చే యాలన్న ఉద్దేశంతోనే ధన్‌ఖడ్ రాజీనామాకు ఒత్తి డి చేశారనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌జెడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీహార్‌లో సిఎం పదవిని బిజెపి చేతుల్లోకి తీసుకుని నితీశ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న మరో వాదన కూడా బయలుదేరింది. బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నితీశ్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్‌మంత్రి నీరజ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. నీతీశ్ ఆ పదవిలో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అందరూ కోరుకుంటున్నారని మరో బీజేపీ ఎమ్‌ఎల్‌ఏ హరిభూషన్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆ మూడున్నర గంటల్లో ఏం జరిగింది…?
ఇదే సమయంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ కూడా ఆసక్తిని రేపింది. ఉదయం బిఎసి సమావేశానికి ధన్‌ఖడ్ సహా కేంద్ర మంత్రులు జెపి నడ్డా, కిరెణ్ రిజిజు సాయంత్రం సమావేశానికి దూరంగా ఉన్నారని, అంతటితో ఆగకుండా బిఎసి సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారని వెల్లడించారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4.30 మధ్యలో ఏదో జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేయడం పలు వాదనలన్నింటికి బలం చేకూరుస్తుంది. ఇక ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేస్తే కేంద్రంలోని పెద్దలు సహా బిజెపి నేతలు ఎవరూ స్పందించకపోవడం, తీరా మంగళవారంనాడు ఆయన రాజీనామాను రాష్ట్రపతి అమోదించాక ప్రధాని మోడీ, ధన్‌ఖడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేయడం ఇదంతా ముందే ప్రణాళిక ప్రకారం జరిగిందన్న వాదన రాజకీయ పరిశీలకుల్లో ఉంది.

జస్టిస్ వర్మ ఎపిసోడే గండం తెచ్చిందా..?
వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు కూడా ధన్‌ఖడ్ రాజీనామా వెనక కారణాలనే వాదన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపిలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని, దాన్ని అంగీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించడం అధికార పక్షాన్ని ఒకింత ఆత్మరక్షణలోకి నెట్టివేసిందన్న చర్చ జరుగుతోంది. ఇది అధికారపార్టీకి మింగుడుపడని విషయంగా మారినట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెడుతున్న సమయంలోనే రాజ్యసభ ఛైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది. విపక్షాల నోటీసును అంగీకరించినప్పటికీ అధికార పక్షానికి మాటమాత్రంగానైనా సమాచారం ఇవ్వకపోవడం, ఒక వేళ ఇచ్చి ఉంటే అధికార పక్ష ఎంపిలు కూడా వారి సంతకాలతో కూడిన నోటీసును ఇచ్చిన తర్వాత వాటిని ఆమోదిస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించి ఉన్నట్లయితే ఇరు పక్షాలు న్యాయ వ్యవస్థలో జవాబుదారీ తనానికి కట్టుబడి ఉన్నాయన్న సందేశం బయటికి వెళ్లేదని, ఇప్పుడు అది విపక్షం ఖాతాలోకి వెళ్లినట్లయిందని అధికార పక్షం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై పలువురు ఎంపిలు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ సందర్భంగా ధన్‌ఖడ్‌కు మొదటి నుంచి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం, ప.బెంగాల్ గవర్నర్‌గా నియమించడం, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టడం.. ఈ క్రమంలో ఎన్ని వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటికీ ఆయనకు దన్నుగా నిలిచిన విషయం వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

బిఎసి నుంచే కదిలిన పావులు…
సోమవారం సాయంత్రం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం ధన్‌ఖడ్‌కు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. దీంతో రాజ్యసభ ఛైర్మన్ సభను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఇలా సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాల పైనా తాజాగా చర్చ నడుస్తోంది. హై కమాండ్ సూచనల మేరకు ఇరువురు కేంద్రమంత్రులు గైర్హాజరు అయినట్లు కూడా జాతీయ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ అంశాలను కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ధన్‌ఖడ్ ఇటీవల న్యాయవ్యవస్థ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీం కోర్టు రద్దు చేయడాన్ని రాజ్యసభ ఛైర్మన్‌గా తన తొలి ప్రసంగం లోనే తీవ్రంగా ఆక్షేపించారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపి న బిల్లులపై మూడు నెలల గడువు లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన తీర్పుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా వ్యవహరించడం తగదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News