న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడానికి కొద్ది ముందు రాజ్యసభ చైర్మన్ హోదాలో జగదీప్ ధన్‌ఖడ్ నిర్వహించిన సభావ్యవహారాల సలహా కమిటీ( బిఎసి) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుతో పాటుగా మరో సీనియర్ క్యాబినెట్ మంత్రి జెపి నడ్డా సైతం గైరు హాజరు కావడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధన్‌ఖడ్ తన రాజీనామాకు చూపించిన ఆరోగ్య కారణాలకన్నా ఇంకా లోతైన బలమైన కారణం ఉండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించారు కూడా. బిఎసి సమావేశానికి నడ్డా, రిజిజు గైర్ హాజరు కావడంపై ధన్‌ఖడ్ మనస్తాపం చెంది ఉండవచ్చని కూడా జైంరామ్ రమేశ్ అన్నారు.
ఇదే అంశంపై మంగళవారం విలేఖరులు నడ్డాను ప్రశ్నించగా, తాను, రిజిజు ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి ముందే తెలియజేసినట్లు ఆయన చెప్పారు. మంగళవారం కక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నడ్డా, రిజిజుతో పాటుగా హోంమత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సహా పలువురు సీనియర్ కేంద్రమంత్రులతో సమావేశం నిర్వహించిన తర్వాత నడ్డా విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.