మాంచెస్టర్ వేదికగా భారత్‌తో నాలుగో టెస్ట్ ఆడేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్‌లో లీడ్‌లో ఉన్న ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో తమ జట్టుకు స్లో ఓవర్ రేటుపై జరిమానా విధించినందుకు అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓవర్ రేటు విషయంలో తనకు ఆందోళన లేదని చెప్పిన స్టోక్స్.. అది తమ జట్టు కావాలని చేసింది అనడాన్ని తప్పుబట్టాడు.
‘‘ఇక్కడి పిచ్‌లపై బౌలింగ్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియాలో ఉన్నట్లుగా ఇక్కడి పిచ్‌లు ఉండవు. అక్కడ స్పిన్నర్లే ఎక్కువ బౌలింగ్ చేస్తారు. కానీ, ఇక్కడ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కవగా సీమ్ బౌలింగ్‌కి ప్రాధాన్యత ఉంటుంది. స్పిన్నర్లు ఎక్కువ సమయం తీసుకుంటారు. కాబట్టి, ఆసియాలో ఉన్నట్లు ఇక్కడ రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదు. స్లో ఓవర్ రేటు గురించి కాస్త కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. కాంటినెంటల్ నిబంధనలు బట్టి మార్పులు తీసుకురావాలి. బషీర్‌కి గాయం కావడంతో మేము లార్డ్స్‌తో త్వరగా ఓవర్లను పూర్తి చేయలేకపోయాము’’ అని బెన్ స్టోక్స్ (Ben Stokes) వివరించాడు.
ఇక స్లెడ్జింగ్ గురించి స్టోక్స్ మాట్లాడుతూ.. భారత్-ఇంగ్లండ్ రెండు పోటాపోటీగా ఆడుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్లెడ్జింగ్ చేయాలని అనుకోవడం లేదని అన్నాడు. కానీ, ప్రత్యర్థి జట్టు ఘర్షణకు దిగితే మాత్రం ఊరుకోమని హెచ్చరించాడు. నాలుగో టెస్ట్‌కి మంచి బ్రేక్ దొరికిందని.. హాయిగా విశ్రాంతి తీసుకున్నానని అన్నాడు. ఇప్పుడు ఈ బ్రేక్‌తో మ్యాచ్‌కు ఉత్సాహంగా సిద్ధమవుతామని వెల్లడించాడు.