కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం
తప్పే దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకు విశ్రమించను
ఇది నా శపథం దేశంలో ఓబిసిల చరిత్ర రాయక పోవడం
వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర తెలంగాణ కులగణన దేశ రాజకీయ
క్షేత్రంలో భూకంపం వంటింది తెలంగాణ సర్వే ఆధారంగా
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేస్తాం ప్రైవేట్ సంస్థల్లోనూ
రిజర్వేషన్లు కల్పించాలి ఢిల్లీలో జరిగిన భాగిదారి న్యాయ
సమ్మేళన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : కేంద్రంలో కాం గ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా తప్పు చేశానని, ఇప్పుడు సవరించుకుంటానని ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఏఐసిసి ఒబిసి మోర్చా నిర్వహించిన ‘భాగిదారి న్యాయ సమ్మేళన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రా హుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒబిసిల సమస్యలను లోతుగా అధ్యయనం చేయలేకపోయానని ఆవేదన చెందారు. ఒబిసిల హక్కులను సంపూర్ణంగా ర క్షించలేకపోయామని ఆయన తెలిపారు. ఒబిసిల చరిత్ర, సమస్యలను తాను కొద్దిగా ముందుగానే తెలుసుకుని ఉంటే అప్పట్లోనే కులగణన చేపట్టి ఉండేవాడినని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని, ముమ్మాటికీ తన తప్పేనని అన్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రైవేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు తీసుకుని రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనగణనతో పాటు కులగణన చేసినప్పుడే ఎక్స్‌రే, స్కానింగ్ నివేదిక వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కుల గణన దేశానికే ఆదర్శమని ఆయన చెబుతూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. కులగణన డేటా దేశంలో కేవలం తెలంగాణలో ఉందని అన్నారు. తెలంగాణలో ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టిల డేటా ఉందని, సరైన డేటా ఉన్నప్పుడే ఏదైనా చేయగలమని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదన్నారు. అది తన శపథం అని ఆయన చెప్పారు.
అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థం అందరికీ రావాలని, కొందరికి తమ శక్తిని తెలుసుకోలేకపోవడమే సమస్య అని ఆయన తెలిపారు. దేశంలో దళితుల చరిత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్థం చేసుకున్నారని అన్నారు. ఒబిసిల చరిత్ర ఎక్కడ ఉంది? ఎవరు రాశారు? అని ఆయన ప్రశ్నించారు. ఒబిసిల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఒబిసి చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అణచి వేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒబిసిలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఇండియాలో ఒబిసిలకు ప్రాధాన్యత లేదన్నారు. అదాని ఒబిసినా, మీడియా రంగంలో ఒబిసిలకు స్థానం ఎక్కడ ఉంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇంగ్లీషు నేర్చుకుంటే అవకాశాలు చాలా మెరుగు అవుతాయని ఆయన తెలిపారు. బిజెపి నాయకులు ఇంగ్లీషును వ్యతిరేకించడం అవివేకమవుతుందని ఆయన విమర్శించారు. ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీషు కూడా ముఖ్యమేనని ఆయన తెలిపారు. ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంగ్లీషును దళిత, గిరిజన విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.
దళిత, గిరిజనులను అంటరానివారిగా చూస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో దళితులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతున్నదని ఆయన విమర్శించారు. దేశంలోని ఏ సంస్థలోనూ బడుగు, బలహీనవర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. దళితులు, గిరిజనును అభివృద్ధి చెంద వద్దని చూస్తున్నారని, వారి నిధులను కేంద్రం మళ్లిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. దళిత, గిరిజనుల సంపదను ఆదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో కుల, మత రాజకీయాలు పెరిగాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా జనగణనను నిలిపి వేసిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని తాల్కొటోరా ఆడిటోరియంలో జరిగిన ఈ సమ్మేళనంలో డిప్యూటీ సిఎం భట్టి, రాష్ట్రానికి చెంది మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, బిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.