మన తెలంగాణ/రాజేంద్రనగర్ : ఫుడ్ కోర్టు యజమానిని నిబంధనల పేరుతో బెదిరింపుల కు గురి చేసి డబ్బు డిమాండ్ చేసిన ఓ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. రెండు లక్ష లు నగదు లంచంగా తీసుకున్న ఆ డిప్యూటీ కమిషనర్ ఏసీబీ అధికారుల ముందు ఏమా త్రం బెదరని విధంగా వ్యవహరించడం ఆశ్చర్యపరిచింది.రాజేంద్రనగర్‌లో జరిగిన ఈ సం ఘటన వివరాలు ఏసీబీ సిటీ రేంజ్ డిసిపి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కె. రవి కుమార్ సర్కిల్ పరిధిలోని ఓ ఫుడ్ కోర్టు తనిఖీ చేసి నిబంధనలు పాటించడంలేదని హెచ్చరించాడు.అంతటితో ఆగని ఆయన ఫుడ్ కోర్టు సీజ్ చేస్తానని, లేదంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దాంతో సదరు ఫుడ్ కోర్టు యాజమాని అవినీతినిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా డిప్యూటీ కమిషనర్ డిమాండ్ చేసిన మొత్తంలో శుక్రవారం రూ. 2 లక్షలు ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. దాంతో ఫుడ్ కోర్టు యజమాని తన బెదింరిపులకు దిగి వచ్చాడని భావించిన డిప్యూటీ కమిషనర్ సరే రమ్మన్నాడు. సర్కిల్ కార్యాలయంలో బాధితుడు రెండు లక్షల నగదును డిప్యూటీ కమిషనర్‌కు ఇచ్చాడు. అంతే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే ఆ మొత్తాన్ని ట్రీ పాట్‌లో వేసి డ్రైవర్‌కు ఇచ్చి వాహనంలో పెట్టమని పంపాడు డిప్యూటీ కమీషనర్. డ్రైవర్ ట్రీ పాట్ ఉన్న బ్యాగును వాహనంలో పెట్టాడు. ఏసీబీ అధికారులు ఇదంతా రికార్డు చేస్తున్న విషయాన్ని ఆ అవినీతి డిప్యూటీ కమిషనర్ గ్రహించలేకపోయాడు. ఏబీసీ అధికారులు తమకు అందిన ఫిర్యాదు మేరకు రైడ్ చేస్తున్నామని చెప్పగా, నేను అలాంటి వాడిని కాదు… తనిఖీ చేసుకోండి అంటూ ఎంతో తాపీగా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికే డ్రైవర్ బ్యాగు తీసుకువెళ్లి వాహనంలో పెట్టడాన్ని క్షుణంగా గ్రహిస్తున్న ఏసీబీ అధికారులు వాహనం వద్దకు వెళ్లగా డ్రైవర్ డోర్ తీయకుండా కొంత సేపు ఇబ్బంది పెట్టాడు.
డోర్ తీయక పోతే గ్లాస్ పగుల గొడుతామని హెచ్చరించడంతో అతను వాహన డోర్ తీశాడు. వెంటనే బ్యాగుతోపాటు ట్రీ పాట్‌ను పరిశీలించిన అధికారులకు అందులో రూ.500 రూపాయల నోట్లతో కూడిన నాలుగు కట్టలు కనిపించాయి. ఆ నగదు పై డిప్యూటీ కమీషనర్ వేలిముద్రలు నిర్ధారించిన ఏసీబీ అధికారులు కెమికల్ పరీక్షలు నిర్వహించిపూర్తి నిర్ధారణకు వచ్చారు. అప్పడు చేసిన నేరం ఒప్పుకోక తప్పలేదు డిప్యూటీ కమీషన్ రవి కుమార్‌కు. ఈ మేరకు అవినీతి రోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ నివాసంతో పాటు అతని బందువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఎందుకు లంచం తీసుకున్నావని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు విస్తుపోయే విధంగా పై అధికారులతో పాటు మీడియా ప్రతినిధులకు ఇందులో వాటా ఇవ్వాలని బదులిచ్చినట్లు చెప్పడం కొస మెరుపు.
ఆనందం వ్యక్తం చేసిన సిబ్బంది
రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాలయంలో పనిచేసే పలువురు సిబ్బంది డిప్యూటీ కమీషనర్ లంచం తీసుకుంటు పట్టుబడ్డాడని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. నానాటికి అతని అవినీతి వేధింపులు భరించలేకపోతున్నామంటూ కొందరు చెప్పారు. అయితే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ పై చాలా కాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఏసీబీ అధికారులు సుమారు ఆరు నెలలుగా నిఘా పెట్టారు. సరైన విధంగా బాధితులు ముందు వచ్చి ఫిర్యాదు చేయకపోడంతో ఏమి చేయలేకపోయినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.