Sunday, July 27, 2025

ముస్లింల కోసమే బిసి రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : బి సి రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర బొగ్గు గ నుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులకు నీతులు చెప్పే ముందు తన పదవికి రాజీనామా చేసి బిసిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసిసి ఒబిసి సెల్ ఢిల్లీలో నిర్వహించిన ఒబిసిల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. శుక్రవారం కిషన్ రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 42 శాతం రిజరేషన్లు బిసిలకు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ అందు లో పది శాతం ముస్లింలకు కల్పిస్తే, మిగిలేది 32 శాతమేనని అన్నారు. గతంలో బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లు 32 శాతానికి తగ్గుతాయని ఆయన తెలిపారు. ఏదో బిసిలను ఉద్దరించినట్లు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజాలు చరుచుకుంటున్నారని ఆయన విమర్శించారు.

బిసి రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిసిలను మోసం చేసేలా మీరు తూతూ మంత్రపు సర్వేలు చేయడం తమ వల్ల కాదని, తాము నిజాయితీగా జనగణనతో పాటు కులగణన సర్వే చేయనున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కుల గణనను రాజ్యాంగబద్దం చేసి, భవిష్యత్తులో బిసిలకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బిసిని కూడా ముఖ్యమంత్రి చేయలేదని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బిసిని కూడా ప్రధానిని చేసిన పాపాన పోలేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో అనేక మంది బిసి ఎంపీలకు స్థానం కల్పించడం జరిగిందని, బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందీ బిజెపినే అని ఆయన ఉదహరించారు. అత్యధిక మంది బిసి, ఎస్‌సి, ఎస్‌టి ఎంపీలను గెలిపించుకున్నామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బిసి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హేళన చేయడం భావ్యం కాదన్నారు. మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 1972లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని, అటువంటప్పుడు వారు కూడా కన్వర్టెడ్ ఎస్టీలు అవుతారా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రధాని మోదీ కులాన్ని బిసి జాబితాలో చేర్చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో మోదీ కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరన్నారు. అదే సమయంలో విశ్వ బ్రాహ్మణులతో పాటు మరి కొన్ని కులాలను కూడా బిసి జాబితాల్లో చేర్చడం జరిగిందని ఆయన వివరించారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం అవివేకమే అవుతుందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతున్నదని, మూడో సారి కూడా దేశ ప్రజలు నరేంద్ర మోదీని ప్రధానిగా చేయడంతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయమని ఆయన తెలిపారు. వంద మంది రాహుల్ గాంధీలు, వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి గెలుపొందదని ఆయన అన్నారు. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా సీట్లు దక్కాయని ఆయన తెలిపారు. బిసిల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత తన పదవికి రాజీనామా చేసి బిసి నేతకు అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల కోట్లకు పడగలెత్తిన ఒవైసీ లాంటి వ్యక్తులతో మధ్యతరగతి, బిసిలకు మేలు జరగదని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తున్నదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News