మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ఫీజుల నిర్ధారణకు సవరణ మార్గదర్శకాల సూచనల కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఎస్‌సిడిడి కమిషన్ ఎన్.క్షితిజ, స్టేట్ ఆడిట్ విభాగం డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, డిటిసిపి డైరెక్టర్ ఎస్.దేవేందర్ రెడ్డి, ఉన్నత వి ద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, జెఎటియుయుహెచ్ రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వరరావు, ఒయు ఇంజనీరింగ్ విభాగం డీన్ ఎ. క్రిష్ణయ్య తో పాటు కమిటీ చైర్మన్ కోరుకుంటే మరో ఇద్ద రు విషయ నిపుణులను కమిటిలో సభ్యులుగా నియమించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు ల విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ప రిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న ది. కళాశాలలు పాటిస్తున్న ప్రమాణాలు, సౌకర్యాలను పరిశిలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా.. యాజమాన్యాలను టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు పిలిపించి చర్చించారు. ఆ సందర్భంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను టిఏఎఫ్‌ఆర్‌సి రిజిస్టర్‌లో నమోదు చేసింది.
వివిధ కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులపై త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఆ కమిటీ పరిశీలిస్తుందని, వాటితోపాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీం కోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా, కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటి(టిఎఎఫ్‌ఆర్‌సి)కి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఫీజులపై హేతుబద్దమైన నిర్ణయం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, భవనాలు, బోధన ప్రమాణాలు, ఇతర వసతుల వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం చెప్పినట్లుగానే ఫీజుల నిర్ధారణకు సవరణ మార్గదర్శకాల సూచనల కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.