Sunday, July 27, 2025

ఫ్యూచర్‌ సిటీలో నీకింత…నాకింత

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపి సిఎం రమేష్‌కు
రూ.1600కోట్ల రోడ్ల కాంట్రాక్టు
కంచగచ్చిబౌలి భూముల తనఖాకు
సహకరించినందుకు బహుమతి
ఇది క్విడ్ ప్రో కో కాక మరేంటి?
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య
రాజకీయ అక్రమ సంబంధం
బిజెపి ఎంపికి వందల కోట్ల కాంట్రాక్టులు
రేవంత్ కట్టబెడుతుంటే రాహుల్
కళ్లు మూసుకున్నారా? సోనియా
రాసిన ఉత్తరంలో ఏముందో
చదవలేని సిఎం రేవంత్‌రెడ్డి
ఆయన చదువులు ఫేక్ అని
అనుమానం కలుగుతుంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్ : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బిజెపి ఎంపి సిఎం ర మేష్ హస్తం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల తనఖాకు సహాయం చేసి కమీషన్లు ఇచ్చినందుకు క్విడ్ ప్రో కో కింద సిఎం రమేష్‌కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని అన్నారు. ఇది ముమ్మాటికీ బిజెపి, కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అని పేర్కొన్నారు. కేంద్ర సాధికారత కమిటీ రిపోర్టుపై ఇప్పటి వరకు బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకు మౌనంగా ఉందొ తెలపాలని డిమాండ్ చేసారు. బిజెపి ఎంపికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందల కొద్ది కాంట్రాక్టులు ఇస్తుంటే రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిజెపి నేతలతో కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.

తెలంగాణ భవన్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బిఆర్‌ఎస్‌విలో విలీనం చేశారు. ఈ కార్యక్రమానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, మాజీమంత్రులు జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన పోరాటాలను ఎవరు మరిచిపోరని అన్నారు. విద్యార్థి అమరవీరుల బలిదానాలను తెలంగాణ ఉన్నంతకాలం చెప్పుకుంటారని తెలిపారు. ఉస్మానియా, కాకతీయ,మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన మహోన్నత పోరాటాల ఫలితంగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన కెసిఅర్ చేతుల్లోనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని 2014లో కెసిఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే మొత్తం భారతదేశానికి తెలంగాణ దీపస్తంభం లాగా మారిందని వ్యాఖ్యానించారు.

సిఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది
సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని కెటిఆర్ అన్నారు. కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసిపోతున్న రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుందని పేర్కొన్నారు. సోనియా గాంధీ రాసిన లేఖను కూడా చదివే తెలివి రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని మాట మాత్రంగానైనా ప్రశంసించని సోనియాగాంధీ లేఖను చూసిన ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని, దీనస్థితిని చూసి నవ్వుకుంటున్నారన్నారని చెప్పారు. సోనియాగాంధీ లెటర్‌ను కూడా చదవలేని రేవంత్ రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని కెటిఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్ రెడ్డిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బిజెపి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల మద్దతు ఏమాత్రం లేదని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకి నల్లమల్ల పిల్లి ఉంటే తమకు నల్గొండ పులి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో దళిత బిడ్డ సాయిలును రేవంత్ రెడ్డి పోలీసులు ఎక్కడ అవమానించారో అక్కడే తాము ఆయనకు సన్మానం చేశామని చెప్పారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు జరిపిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి ఆఫర్ లెటర్‌లు ఇస్తూ తానే ఇచ్చానని గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News