షెడ్యూల్ ప్రకారం తెలుగు ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే పోరాటం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు నిర్మాతలు. హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె ఎస్ రామారావు, అశోక్ కుమార్, బసిరెడ్డి, డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, మోహన్ గౌడ్, విజయేందర్ రెడ్డి, వర్చువల్ గా నిర్మాత సి.కల్యాణ్ తదితర నిర్మాతలతో పాటు 150 మందికి పైగా నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడు తూ “తెలుగు ఫిలింఛాంబర్ కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇలాంటి గొప్ప అసోసియేషన్ ను క్రమశిక్షణ ప్రకారం కొనసాగేలా చేయాలని కోరుతున్నా.
ఇప్పుడున్న అధ్యక్షులు భరత్ భూషణ్, ఇతర సభ్యులకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా”అని అన్నారు. నిర్మా త సి. కల్యాణ్ మాట్లాడుతూ “తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి. ఈ అసోసియేషన్‌ను ఒక పద్ధతిలో (Association way) ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు కొందరు స్వార్థంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ తీసుకెళ్లి తిరుపతి లో పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. న్యాయపరంగా పోరాటం చేస్తాం”అని తెలిపారు. నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “తెలుగు ఫిలింఛాంబర్ లో ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోకు, ప్రొడ్యూసర్స్ కు సభ్యత్వం ఉంది. ఈ ఛాంబర్ కు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి తెలుగు ఫిలింఛాంబర్ లో నిరంకుశంగా మేమే కమిటీలో కొనసాగుతాం అనేది తప్పు. తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికల విషయంలో సీఎం రేవంత్‌ని కలవబోతున్నాం. అలాగే మన ఎంపీలతో పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని లేవదీస్తాం”అని తెలియజేశారు.