అమరావతి: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి(25) ప్రొద్దుటూరు ఆర్‌టిసి డిపోలో కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. కుప్పం మండలం మార్వాడకు చెందిన వాసు ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ తన భార్య పిల్లలను పోషిస్తున్నారు. ప్రశాంతికి వాసు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను వాసులు లోబరుచుకున్నాడు. ఫైనాన్స్ కంపెనీలో గొడవలు జరగడంతో అతడిని జాబ్ నుంచి తొలగించారు. దీంతో సొంతూరు మార్వాడకు అతడు వెళ్లిపోయాడు.
తన సొంతూరు వెళ్లినప్పటి నుంచి వాసు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రశాంతి అతడి ఉంటున్న గ్రామానికి వెళ్లింది. వాసు భార్య, పిల్లలు ఉండడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వాసు ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో కాలుతుండగా గ్రామస్థులు స్పందించి మంటలను ఆర్పేశారు. వెంటనే యువతిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య విషమంగా ఉండడంతో అక్కడి నుంచి తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. ప్రశాంతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాసు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.