డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికా- భారత్ సంబంధాలు గణనీయమైన క్షీణతను చవిచూస్తున్నాయి. అమెరికాను తిరిగి గొప్పదేశంగా మార్చాలనే ట్రంప్ లక్ష్యం దేశభక్తితో కూడిన ఆలోచనగా కనిపించినప్పటికీ, ఆయన అనుసరిస్తున్న విధానాలు, హఠాత్తు నిర్ణయాలు, అనాగరిక భాష, ప్రవర్తన అమెరికా ప్రతిష్ఠను, అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. భారతీయులే లక్ష్యంగా ట్రంప్ విధానాలు భారతీయ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలలో భారతీయుల నియామకాలను నిషేధించాలని ఆయన చేసిన పిలుపు, భారతదేశంతో సంబంధాలను దెబ్బతీసేలా ఉంది. ఈ వైఖరి కేవలం ఆర్థిక సంబంధాలను మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక సాంస్కృతిక, సామాజిక బంధాలను కూడా దెబ్బతీస్తోంది. భారతీయ వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో గణనీయమైన కృషి చేశారు.
సుందర్ పిచాయ్ (గూగుల్ సిఇఒ), సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సిఇఒ) వంటి భారతీయ కంప్యూటర్ సైన్స్, సాంకేతిక నిపుణులు అమెరికా టెక్ రంగంలో (America tech sector) విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ట్రంప్ ఈ హెచ్చరికలు వారి సహకారాన్ని అవమానించడమే కాకుండా, అమెరికా బహు సాంస్కృతిక స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తున్నాయి. అమెరికా మీడియాలో కూడా ఈ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రికలు ట్రంప్ వలస విధానాలను ‘ఆర్థిక స్వయం విధ్వంసం’గా అభివర్ణించాయి. ఎందుకంటే భారతీయ టెక్ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల విలువైన సహకారం అందిస్తున్నారు. అదే సమయంలో, భారతీయ మీడియా సంస్థలు, ‘ది హిందూ’, ‘ఇండియా టుడే’ వంటివి, ట్రంప్ వైఖరిని ‘వివక్షపూరితం’ అని ఖండించాయి. ఇది భారతీయ సమాజంలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించింది.
ట్రంప్ విదేశీ విధానాలు కేవలం భారతదేశంతోనే కాకుండా ఇతర దేశాలతో సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ ఇజ్రాయెల్, అలాగే ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక సహాయం అందించడం, యుద్ధాలను ప్రోత్సహించడం వంటి చర్యలు అంతర్జాతీయ సమాజంలో అమెరికా నైతిక స్థానాన్ని దిగజార్చాయి. ‘గార్డియన్’ (యుకె), ‘లే మాండే’ (ఫ్రాన్స్) వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ట్రంప్ నిర్ణయాలను ‘ప్రపంచ శాంతికి ముప్పు’ గా అభివర్ణించాయి. ఈ విధానాలు అమెరికాను ఒంటరిగా నిలబెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంతో సంబంధాలలో, ట్రంప్ వ్యక్తిగత విమర్శలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్నేహపూర్వక సంబంధాలను కూడా దెబ్బతీశాయి.
ఒకప్పుడు ‘మోడీ నా మంచి మిత్రుడు’ అని ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు భారతదేశంపై విమర్శలు గుప్పించడం, వాణిజ్య ఒప్పందాలలో అసమంజసమైన షరతులు విధించడం వంటి చర్యలతో ద్వైపాక్షిక సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాడు. భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు అమెరికా సహకారంతో మరింత బలపడవచ్చునని భారతీయ విశ్లేషకులు భావించినప్పటికీ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు ఈ అవకాశాలను అడ్డుకుంటున్నాయి. ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అమెరికాలోనూ, అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. అమెరికాలో, న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో భారతీయ వలసదారులు, స్థానిక అమెరికన్లు ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్లకార్డులతో నినాదాలతో హోరెత్తించారు.
భారతదేశంలో న్యూఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ట్రంప్ వైఖరిని ఖండిస్తూ నిరసన దీక్షలు జరిగాయి. ఈ నిరసనలు ట్రంప్ విధానాలు కేవలం ఆర్థిక సమస్యలను మాత్రమే కాకుండా మానవీయ విలువలను కూడా దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేశాయి.అంతర్జాతీయంగా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరులు కూడా ట్రంప్ విదేశీ విధానాలను వ్యతిరేకించారు. లండన్‌లో జరిగిన ఒక భారీ నిరసన ర్యాలీలో ట్రంప్ యుద్ధ ప్రోత్సాహక విధానాలను ‘ప్రపంచ శాంతికి ముప్పు’ గా అభివర్ణించారు. ఈ నిరసనలు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ విధానాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లో యుద్ధాలకు సహకారం, ప్రపంచశాంతికి విరుద్ధంగా ఉన్నాయి.
అటువంటి నాయకుడికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తే అది ఆ బహుమతి గౌరవాన్ని దిగజార్చడమే అవుతుంది. ప్రపంచ ప్రజలు నవ్విపోతారు. అంతర్జాతీయ విశ్లేషకులు, ‘ట్రంప్ చర్యలు శాంతిని ప్రోత్సహించడం కాదు, సంఘర్షణలను రెచ్చగొట్టడం’ అని స్పష్టం చేశారు.ట్రంప్ ఇజ్రాయెల్- పాలస్తీనా విధానం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో, నోబెల్ శాంతి బహుమతి నిర్వాహకులు ట్రంప్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అది ప్రపంచవ్యాప్తంగా నిందలను ఆహ్వానించడమే అవుతుంది. ‘నోబుల్ శాంతి బహుమతి’ ప్రతిష్ఠ దిగజారుతుంది.ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. అంతర్జాతీయ సంబంధాలలో ‘ఏకాకి’ అవుతుంది. ఆర్థిక సంక్షోభం, సామాజిక అసమానతలు అమెరికా పౌరులకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి. భారతదేశంతో సంబంధాల దెబ్బతినడం వల్ల, అమెరికా టెక్ రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
అదే సమయంలో భారతదేశం వంటి దేశాలు చైనా, రష్యా వంటి ఇతర శక్తులతో సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు.ఇది అమెరికా భౌగోళిక -రాజకీయ ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. ట్రంప్ అనాగరిక భాష అతని మానసిక, బాహ్య ప్రవర్తన, హఠాత్తు నిర్ణయాలు, వివాదాస్పద విధానాలు అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టే ప్రమాదం ఉంది. భారతదేశంతో సంబంధాల దెబ్బతినడం, వలసదారులపై వివక్ష, యుద్ధ ప్రోత్సాహక విధానాలు అమెరికా నైతిక, ఆర్థిక స్థానాన్ని దిగజార్చాయి. ప్రపంచ దేశాల ప్రజలు, మీడియా, నిరసనకారులు ట్రంప్ వైఖరిని ఖండిస్తున్నారు. ఈ పరిస్థితిలో ట్రంప్ తన విధానాలను సమీక్షించుకోవాలి లేకపోతే అమెరికా దీర్ఘకాలిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ శాంతి, సహకారం, బహుసాంస్కృతిక సమాజాన్ని ప్రోత్సహించే నాయకత్వం అవసరం. ట్రంప్ విభజనకర విధానాలు కాదు.
- డా. కోలాహలం
రామ్‌కిశోర్
9849328496