Monday, July 28, 2025

రిజర్వేషన్లపై పరిమితి తొలగించలేమా?

- Advertisement -
- Advertisement -

ఇటీవల దేశంలో రిజర్వేషన్ పరిమితిపై చర్చ జరుగుతోంది. మరోవైపు రిజర్వేషన్లతో సమాజంలో ఒక విభజన రేఖ ఏర్పడుతుంది. నేడు వీటిని అట్టడుగు వర్గాలతోపాటు అగ్రకుల పేదలకు సైతం విస్తరించారు. తమ జనాభాకు మించి లబ్ధి జరుగుతున్నది. కానీ, రిజర్వేషన్ లబ్ధి వర్గంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఈ క్రమంలో రిజర్వేషన్ల హేతుబద్ధతను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రిజర్వేషన్లకు పునాది వేసినది మొట్టమొదటి రాజు ఛత్రపతి సాహు మహారాజు. 1902 జులై 26 న ఆయన ప్రభుత్వం కొల్హాపూర్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో అట్టడుగు, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. భారతదేశ చరిత్రలో ఇది చారిత్రాత్మక దినం.

ఈ సందర్భంగా ప్రతి ఏటా జులై 26న రిజర్వేషన్ డే జరుపుకుంటారు. భారత సామాజిక వ్యవస్థలోని అసమానతలను తొలగించడానికి సాహు వేసిన గొప్ప ముందడుగు (Sahu great step forward) ఇదీ. సాహు మహారాజు ముందుచూపును బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. దీంతో నేడు ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలు కొంత మేరకు విద్య, ఉద్యోగ అవకాశాలు పొంది ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఆ వర్గాలే రిజర్వేషన్ స్ఫూర్తినీ కొనసాగిస్తూ తమ జాతుల విముక్తికి తోడ్పడాలని అంబేద్కర్ పిలుపునిచ్చారు. కానీ, నేడు రిజర్వేషన్ ద్వారా లబ్ధిపొందిన వర్గాలు తమ జాతిని మరిచిపోతున్నారు. మరోవైపు రిజర్వేషన్ వ్యవస్థ ప్రమాదంలో పడింది. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా కుట్రలు, కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని తిప్పికొట్టాల్సింది కూడా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన వర్గాలే అని గుర్తుపెట్టుకోవాలి.

లేదంటే సంఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉంది. రిజర్వేషన్స్ అమలులో అశాస్త్రీయత కులాలతో నిర్మితమైన భారతదేశంలో రాజ్యాంగం ప్రజల సమానత్వానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో వేల సంవత్సరాల నుంచి విద్యకు దూరమై అస్పృశ్యత, అంటరానితంతో అణిచివేయబడి కనీస మానవ హక్కులకు నోచుకోని వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. ఇలాంటి సామాజిక నేపథ్యం కలిగిన ఏ కులమైన రిజర్వేషన్ పొందవచ్చు. అయినా వీటిపట్ల సమాజంలో జరుగుతున్న విరుద్ధ ప్రచారం వైషమ్యాలను సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరకపోగా అవి దారి తప్పుతున్నాయి. దేశంలో 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలు ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్రవంతికి ఆమడ దూరంలోనే ఉన్నారు.

వీరికి కల్పించిన మొత్తం రిజర్వేషన్ 50 శాతమే. మరి మిగతా 50 శాతం ఎవరికి చెందుతున్నాయో ఒకసారి ప్రశ్నించుకోవాలి.  అగ్రవర్ణ పార్టీలు 10 శాతం లేని అగ్రకుల పేదలకు వారి జనాభాకు మించి విద్య, ఉద్యోగాలలో 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్స్ కల్పించుకొన్నాయి. దీంతో దేశంలో ఎవరు ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారో అర్థమవుతున్నది. ఈ అన్యాయాన్ని గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంఎల్‌సి టి జీవన్ రెడ్డి ఓ సభలో బిసి రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ లేవనెత్తారు. తమ జనాభాకు మించి రిజర్వేషన్ ఉన్నాయని ఆయనే చెప్పారు. అంతేకాకుండా రాజకీయాలను సైతం శాసిస్తున్నారు. జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన తరగతులకు కల్పిస్తోన్న రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని మూడు దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఇప్పుడు దేశంలో 90 శాతం ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌కే పరిమితం చేయడం ఏంటని మేధావుల ప్రశ్న. జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు రిజర్వేషన్ పరిమితిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మరాఠా కమ్యూనిటీకి 16 శాతం రిజర్వేషన్లను పెంచింది. ఇది 50 శాతం కోటా పరిమితిని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టంచేశారు. దీన్ని పార్లమెంట్‌లో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కోర్టు తీర్పుకు ఉల్లంఘన అంటూ కేంద్రం దాటవేస్తుంది.

ఈ అడ్డుగోడను తొలగించేది ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవంగా రిజర్వేషన్ 50 శాతం పరిమితిని దాటాలనుకుంటే పార్లమెంటరీ చట్టం చేయాలి. ఇది జరగాలంటే పార్లమెంట్‌తో పాటు సగానికి పైగా రాష్ట్రాల మద్దతు అవసరం. అసాధారణమైన పరిస్థితులలో 50 శాతం పరిమితిని ఉల్లంఘించవచ్చని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2019 లో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇడబ్లుఎస్) 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీన్ని న్యాయస్థానం సమర్థించింది. అలాంటప్పుడు 90 శాతం ఉన్న వెనుకబడిన అట్టడుగు, అణగారిన వర్గాలకు ఈ సూత్రం వర్తింపచేయలేమా? ఇది సాధ్యం కాదంటే మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే తొలగించాలి.

కులాల జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్ లేదా రిప్రెజెంటేషన్ ఇవ్వాలి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల వైఖరి మారాలి. మారుతున్న కాలానికనుగుణంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ విధాన నిర్ణయాలను కోర్టులు స్వాగతించాలి. మరోవైపు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు తమ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. అసమానతలతో నిండిన సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలంటే ఎవరి వాటా ప్రకారం వారికి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాల్సిందే. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది.

  • సంపతి రమేష్ మహారాజ్
    7989579428
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News