Monday, July 28, 2025

ఆగని జాత్యహంకార బీభత్సం

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతులు, తెగలు, కులాలు, మతాల మధ్య రానురాను వివక్ష, విద్వేషాలు పెచ్చుపెరిగిపోతున్నాయి. ఈ బీభత్సకాండకు గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 6.20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. ఈ విద్వేషం, జాత్యహంకారంపై వరల్డ్ వాల్యూ సర్వే పేరుతో మూడు దశాబ్దాలపాటు 80 దేశాల్లో అధ్యయనం నిర్వహించారు. ఈ దేశాల జాబితాలో అగ్రస్థానంలో జోర్డాన్ ఉండగా, రెండోస్థానంలో భారత్ ఉందని తేలింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో జాత్యహంకార సంఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈనెల 19న మెల్‌బోర్న్‌లోని ఎసెండన్‌లో 29ఏళ్ల భారతీయ యువకుడు జన్‌ప్రీతిసింగ్ భార్యతో కలిసి ఓ డిన్నర్ పార్టీకి వెళ్లి ఇంటికి చేరుకున్నాక, కారు పార్కింగ్ చేస్తుండగా, నలుగురు దుండగులు దాడికి పాల్పడి, ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ నెల రెండో తేదీన ఆస్ట్రేలియాలోనే భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్ హత్య సంఘటన మరువక ముందే ఈదాడి జరగడంతో అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

నితిన్ హత్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఖండించింది. మెల్‌బోర్న్‌లోని బొరోనియాలో ఓ హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. అదే ప్రాంతంలోని ఆసియన్లు నడిపే హోటళ్లపై కూడా ఇలాంటి విద్వేషపూరిత రాతలే (Hateful writings) రాసినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియాలో సుమారు 30 మంది భారతీయులపై దాడులు జరిగాయి. వీటిలో ఎక్కువ శాతం జాతివివక్షకు సంబంధించినవే. జాత్యహంకారంలో అమెరికా కూడా ఏం తక్కువ కాదు. అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి 1968లో ఒక జాత్యహంకారి తూటాలకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బలైన విషాద సంఘటన ప్రపంచాన్నే కుదిపివేసింది. ఆ హత్యకు సంబంధించిన సుమారు 2.4 లక్షల పేజీల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం ఇటీవల బహిరంగ పర్చడం ప్రశంసనీయమే అయినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనలో జాతి విద్వేషం మాసిపోలేదు.

గూఢచర్యానికి పాల్పడుతున్నారని, అమెరికా దేశ మేధోసంపత్తిని కాజేసి చైనాకు అందజేస్తున్నారని నిరాధార ఆరోపణలతో వెయ్యిమందికి పైగా చైనా విద్యార్థుల వీసాలను ట్రంప్ రద్దు చేయడం తెలిసిందే. అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు ఇక నుంచి భారతీయులను నియమించుకోకూడదని, అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని హెచ్చరించడం జాత్యహంకారానికి ఒక ఉదాహరణ కాదా! అమెరికాలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నారని, ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకుని తక్కువ లాభాలు చూపిస్తూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని కూడా ట్రంప్ తన విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్ మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి అభ్యర్థులు జాతి విద్వేషాన్ని చవిచూశారు.

ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులపై కొందరు దుండగులు స్వస్తిక్ గుర్తుతోపాటు నెవర్ ఇన్ ఎడిసన్ అంటూ విద్వేషపూరిత రాతలు రాశారు.  ఇక మన భారతదేశం పరిస్థితి పరిశీలిస్తే జాత్యహంకారం, విద్వేష సంఘటనలకు కొదువ లేదు. దీనికి ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతున్న మణిపూర్ హింసాకాండే ఉదాహరణ. మైనారిటీ కుకీలకు, మెజార్టీ మెయితీలకు మధ్య గత రెండేళ్లుగా విద్వేషాలు భగ్గుమంటున్నా కేంద్రం చూసీచూడనట్టు వ్యవహరించడం శోచనీయం. దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరగడం మామూలైపోయింది. జాతీయ దళిత ఉద్యమం, దళిత మానవ హక్కుల జాతీయ ప్రచార ఉద్యమం ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో 2009 2018 మధ్యకాలంలో దేశంలో దళితులపై అమానుష సంఘటనలు 6% పెరిగాయని వెల్లడైంది.

2019 ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లో కుర్చీలో కూర్చుని వివాహ భోజనం చేసిన 21ఏళ్ల దళిత వ్యక్తిని అగ్రవర్ణస్థులు చితకబాదారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా లోని బూల్గరీ గ్రామంలో 20 ఏళ్ల దళిత మహిళను నలుగురు అగ్రవర్ణస్తులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. 2020 లోనే దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై హత్యాచారం చేసి కుటుంబానికి తెలియకుండానే దహనక్రియ జరిపించే దారుణం ఎవరూ మర్చిపోరు. దేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒకసారి దళితులపై దౌర్జన్యకాండ సాగుతున్నదని అంచనా. 2009 18 లో దళితులపై అత్యాచారాల నిరోధ చట్టం కింద నమోదైన కేసుల్లో సగటున 88.5 శాతం కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక అన్యమతాలవారిపై ఏదో ఒకసాకుతో దాడులు జరుగుతుండడం పరిపాటి అయింది.

మహారాష్ట్రలో ఇటీవల పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సాకుతో గోరక్షకులు హింసాకాండ సాగిస్తున్నారని నిరసిస్తూ పశువుల వ్యాపారం చేస్తున్న ముస్లిం వర్గాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతి వివక్ష, విద్వేషాల దేశాల జాబితాలో మనదేశం జోర్డాన్ తరువాత రెండోస్థానంలో ఉందని నివేదికలో తేలడంపై ఆశ్చర్యపోనవసరం లేదు. జోర్డాన్‌లో 51.4 శాతం మంది వేరే జాతి ప్రజల పొరుగున నివసించడానికి విముఖత వ్యక్తం చేయగా, భారత దేశంలో 43.5% మంది వేరే జాతివారిని తమ పొరుగువారిగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. మన దేశంతో పోల్చుకుంటే ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాన్, వియత్నాం, ఇండోనేసియా, దక్షిణ కొరియా దేశాల్లో 30 నుంచి 39.9% వరకే జాతి వివక్ష కనిపిస్తోందని వరల్డ్ వాల్యూ సర్వే వెల్లడించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News