హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా మాజీ సిఎం కెసిఆర్ గుర్తుకు వస్తున్నారని మాజీ బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. గోదావరి- బనకచర్లకు కలిగే నష్టంపై బిఆర్ఎస్వీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ సందర్భంగా హరీష్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, రేవంత్ ఎక్కడ మాట్లాడినా కెసిఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.
ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు.. నిధులు దిల్లీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి, చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. గురుశిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తానని హరీష్ రావు పేర్కొన్నారు.