ఆత్మకథలు రాసే వాళ్లకు నిజాయితీ ఉండాలి. జీవిత చరిత్రలు గ్రంథస్థం చేసే వాళ్లకు సరైన పరిశోధన ఉండాలి, అధ్యయనం ఉండాలి. వక్రీకరణలకు తావు లేకుండా గతాన్ని భవిష్యత్తు తరాలకు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే నిజాయితీ కూడా తోడు కావాలి. అట్లా కాకుండా తమ ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించి రాయడం క్షమార్హం కాదు. లిఖితపూర్వకంగా నిక్షిప్తమై ఉండే చరిత్ర భవిష్యత్ తరాలకు గతాన్ని నిలువుటద్దంలో పెట్టి చూపిస్తుంది. ప్రస్తుతం అద్దంతో కూడా అబద్ధాలు చెప్పించగలిగిన వాళ్ళు బయలుదేరారు, చరిత్రను తమకు అనుకూలంగా అష్టవంకరలు తిప్పి రాసేస్తున్నారు. మన కళ్ళముందటి చరిత్ర అయిన స్వాతంత్రాన్ని ఆ స్వాతంత్రాన్ని సాధించుకునేందుకు జరిగిన పోరాటాన్ని నానావంకర్లు తిప్పి తమకు అనుకూలంగా రాయించుకుంటున్న వాళ్లు ప్రస్తుతం మనకు సమాజంలో తారసపడుతున్నారు.
ఇంత జరుగుతుంటే చరిత్ర గ్రంథాలే అత్యంత వక్రీకరణలకు గురై అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారంలోకి తెస్తుంటే అటువంటి వక్ర భాష్యాల ఆధారంగా తీసే సినిమాలు లేదా అసలు చరిత్రతో సంబంధం లేకుండా చారిత్రక ఆధారాలు లేకుండా ఒక వర్గాన్ని, ఒక మతాన్ని దుర్మార్గంగా చూపడానికి, ప్రజలలో ఆ వర్గం పట్ల, ఆ మతం పట్ల ద్వేషాన్ని ఇనుమడింప చేయడానికి ఈ మధ్య చాలానే సినిమాలు వస్తున్నాయి. ఒక మతం మీద ద్వేషంతో చారిత్రక పునాదుల్ని పెకిలించివేసి ఊళ్ళకు ఊళ్ల పేర్లు మార్చేస్తున్నారు. తమకు గిట్టని మతం వారి పేర్లతో ఉంటే వీధుల పేర్లు కూడా మార్చేస్తున్నారు. ఆ పేర్లు ఉన్న మనుషులనే ద్వేషించే వారికి ఊళ్ళ పేర్లు, వీధుల పేర్లు మార్చడం పెద్ద పని కాదు. ప్రస్తుతం భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వర్గం హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చరిత్ర వక్రీకరణ జరుగుతున్నది. మోర్ లాయర్ దాన్ ద కింగ్ అన్న ఇంగ్లీష్ సామెత రాజును మించిన విధేయత ప్రదర్శించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఒక నయా కాషాయ వస్త్రధారి సినిమాల ద్వారా కల్పితాలను చరిత్రగా నిరూపించేందుకు చేస్తున్న విఫల ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఒక సినిమా విడుదలై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ సినిమా పేరు ‘హరిహర వీరమల్లు’. కాషాయ వస్త్రధారి పేరు పవన్ కళ్యాణ్. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమిలో ఒక ముఖ్యుడు, ఉపముఖ్యమంత్రి. నయా కాషాయ వస్త్రధారి అనడానికి కారణం ఆయన రాజకీయాల్లోకి వచ్చినకొత్తలో రెడ్ షర్టు ధరించి కమ్యూనిస్ట్‌లతో చెట్టాపట్టాలు వేసుకున్నవాడు. రాజకీయాల్లోకి వచ్చిన పదిహేనేళ్ళలో కొంతకాలం యేసుక్రీస్తు భజన, మరికొంత కాలం ఇస్లాం జపం చేసినవాడు. చేగువేరా, భగత్ సింగ్‌లకు సిసలైన వారసుడినని చెప్పుకున్నవాడు. దేవుడికి దీపం వెలిగిస్తే ఆ దీపంతో తన సిగరెట్ వెలిగించుకున్న తండ్రి పెంపకంలో పెరిగానని చెప్పుకున్నవాడు. మళ్ళీ అదే నోట చిన్ననాటి నుండి తన ఇంట్లో నిత్యం రామ జపం జరుగుతుండేదని, రామనామం వింటూ పెరిగిన జీవితం తనదని చెప్పుకునేదాకా ఎప్పటికప్పుడు తన రాజకీయ అవసరం కోసం ఆయన ఒంటిమీద బట్టలతోపాటు మత విశ్వాసాన్ని కూడా మార్చేస్తుంటారు. మతం వ్యక్తిగతం, అక్కడికే పరిమితమైతే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వేలు లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేసే ఒక కళా రంగంలో ఉన్నాడు. ఇవాళ సినిమాను మించిన అత్యంత బలమైన కళారూపం ఇంకోటి లేదు. గత చరిత్రలో ఉన్న కొన్ని పాత్రలను తీసుకొని ఒక మతం పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే సినిమాలు తీస్తున్నాడు.
హరిహర వీరమల్లు అనే సినిమా అటువంటిదే. ఈ సినిమా విజయవంతంగా నడిచి ఉండవచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందించిన చేయూతతో అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచుకొని ప్రేక్షకుల జేబులు కత్తిరించేసి వందల కోట్లు సంపాదించి ఉండవచ్చు. కానీ ఇది సమాజానికి వీసం ఎత్తు కూడా మేలు చేసేందుకు పనికిరాదు. ఈ సినిమాలో హీరో ఒక దొంగ, బ్రిటీష్ వారు దోచుకుపోతున్న లేదా చవకగా కొనుక్కొని పోతున్న భారతదేశ సంపద ను తాను చోరీ చేసి దాన్ని మళ్ళీ యజమానులకు డబ్బు తీసుకుని అమ్మే పని చేస్తుంటాడు. చరిత్రలో ఈ క్యారెక్టర్ కనిపించదు. గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా, ఢిల్లీ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు చరిత్రలో ఉన్నవాళ్లే, వీళ్ళు దుర్మార్గులని చెప్పేందుకు ఈ సినిమా పూర్తి ప్రయత్నం చేస్తుంది. ఔరంగజేబ్ పట్ల కులీ కుతుబ్ షా పట్ల సదాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ఆ మాటకొస్తే రాజరిక వ్యవస్థలో రాజ్యాలేలిన రాజుల అనేకమంది పట్ల, వాళ్ళు ఏ మతం వారయినా సదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లలో అత్యధికులు ప్రజలను హింసించి వాళ్ళ ధనమానప్రాణాలను హరించి తాము విలాసవంతంగా జీవించడానికి బాటలు ఏర్పరచుకున్న వాళ్లే. జనరంజక పాలన అందించిన కొద్ది మంది రాజుల్లో హిందూయేతర రాజులు కూడా ఉన్నారు.
ఈ సినిమా అట్ల తీస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. అసలు ఈ సినిమా ఒక్కటే కాదు. గత దశాబ్ద కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు చూసినట్టయితే ఒక మతం మీద విద్వేషం రగిలించేందుకు, ఇంకో మతం వారిని రెచ్చగొట్టేందుకు జరిగే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, శంభాజీ, ఝాన్సీ, చావా, రజాకార్ ఇట్లా లెక్కబెడుతూ పోతే చాలా సినిమాలు మనకు కనిపిస్తాయి. హరిహర వీరమల్లు సినిమా అద్భుతం, అందరూ చూసేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ బహిరంగ ప్రకటన ద్వారా జనానికి సలహా ఇస్తారు. ఉపముఖ్యమంత్రి అయితే అందులో స్వయంగా నటించడం మాత్రమే కాకుండా దాదాపు ఒక అరగంట ఒక మతం మీద తీవ్ర విద్వేషాన్ని రగిలించే విధంగా ఉన్న సన్నివేశాల్ని ఆయనే రూపొందించినట్టు సినిమా ప్రారంభంలో తెరమీద ప్రత్యేకంగా పేర్కొనడం కనిపిస్తుంది. ఇంతకు ఈ సినిమా కథ ఏమిటి ఔరంగజేబు ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని కొట్టుకు రావడం దాంతోపాటు ఔరంగజేబు బంధించిన కొంతమంది మత గురువులను కూడా విడిపించుకు రావడం.
గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా తరఫున కోహినూరు వజ్రాన్ని తేవడానికి ఢిల్లీ చేరుకున్న ఆ దొంగ ఔరంగజేబుతో తలపడటం దగ్గర సినిమా అయిపోతుంది. రెండోభాగం కూడా చూడాల్సి ఉన్నది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందులో చరిత్ర ఇంకెంత వక్రీకరణకు గురవుతుందో తెలియదు. ఈ మొదటి భాగం చిత్రీకరణకు ఐదు సంవత్సరాలు పట్టింది, దర్శకులు మారారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీతో తాజా స్నేహం తర్వాత ఈ సినిమా హీరో / ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారిని మెప్పించడం కోసం కథను మార్చుకున్న కారణంగా సినిమా రావడానికి ఇన్నేళ్ళు పట్టిందని చెప్తున్నారు. తాజా స్నేహం అనడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినపుడు మొదట కాంగ్రెస్ ద్వేషి. సోదరుడు స్థాపించిన పార్టీలో యువజన విభాగానికి బాధ్యుడిగా ఉండి ఆ పార్టీ గంపగుత్తగా కాంగ్రెస్‌లో కలిసిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన వ్యక్తి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు. ఉత్తరాది పెత్తనాన్ని సహించేది లేదని గాండ్రించిన బెబ్బులి, మళ్ళీ అదే హిందీ మన పెద్దమ్మ, ఆ భాష నేర్చుకోవాల్సిందే అని ఉద్యమం నడుపుతున్న జాతీయవాది.
సినిమా రెండో భాగంలో ఏం ఉండబోతున్నది అనే చర్చ జరుగుతున్నది. దానికి పవన్ కళ్యాణ్ విమర్శకులు చెపుతున్నదేమిటంటే అసలు రెండో భాగం ఎప్పుడొస్తుందో ముందు తేలి ఆనాటికి రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయో తెలిస్తే గాని ముగింపు ఎట్లా ఉంటుందో చెప్పలేం అంటున్నారు. ఇంకో పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో ఉంటుందనీ, దానికి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారనీ పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటిస్తున్నా జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణలు స్థిరంగా ఉంటాయని చెప్పలేని పరిస్థితి. మూడవ సారి లోకసభలో బొటాబొటీ స్థానాలు గెలిచి మిత్రపక్షాల మీద ఆధారపడి అధికారంలోకి రావడం, ప్రధానమంత్రి వయసుకు సంబంధించిన చర్చ ఆర్ఎస్ఎస్ శిబిరంలోనే జోరందుకోవడం, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తీరు ఆ వ్యవహారంలో బిజెపి పెద్దల తదనంతర వైఖరి ఈ అభిప్రాయం కలిగిస్తున్నదని పరిశీలకుల భావన. సినిమాకు రాజకీయ సమీకరణలకు సంబంధం ఏమిటీ అంటే ఆ రెండిటినీ కలగాపులగంచేసి సినిమా గ్లామర్‌ను రాజకీయాలకు వాడుకుంటున్న వాళ్ళను అడగాలి సమాధానం.
హరిహర వీరమల్లు రెండవ భాగం తీయడం అందులో కోహినూర్ భవిష్యత్తు తేల్చడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ మిత్రులే కాబట్టి వారి మీద ఒత్తిడి తెచ్చి బ్రిటన్ పాలకులను ఒప్పించి కోహినూర్ వజ్రాన్నే భారతదేశానికి తిరిగి తెప్పించుకోవడం సులభమేమో పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని కొల్లూర్ అనే చోట గనుల తవ్వకంలో దొరికిన కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల నుండి ఢిల్లీ రాజులు, అటు నుండి పర్షియన్ రాజు నాదిర్షా, ఆయన మరణానంతరం సిక్కు రాజు రంజీత్ సింగ్‌కు చేరి చివరికి బ్రిటిష్ వారి చేతుల్లో పడి బ్రిటిష్ రాణి శిరస్సున వెలిసింది. ఇప్పుడు భారతదేశం, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, ఇరాన్ దేశాలు ఎవరికి వారు కోహినూర్ వజ్రం తమ సొంతం అని చెపుతున్నాయి.సినిమా రెండో భాగమా, కేంద్రంలో పెద్దల ద్వారా బ్రిటన్ను ఒప్పించి కాంతి పర్వతాన్ని (కోహినూర్ అర్థం అదే) ఆంధ్రప్రదేశ్‌కు సాధించుకోవడమా ఏది సులభం? ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఆలోచించుకోవాలేమో.