Monday, July 28, 2025

కరీంనగర్ లో రాజకీయాలకు తావులేదు.. మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధికి కృషి చేస్తా: బండి

- Advertisement -
- Advertisement -

త్వరలో హుస్నాబాద్ లో నవోదయ, సైనిక్ స్కూలు ఏర్పాటుకు కృషి
ప్లాస్టిక్ నిర్మూలించడంలో మంత్రి పొన్నం కృషి అమోఘం
ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం
ప్రభుత్వ పాఠశాలలో అర్హత ఉపాధ్యాయులకే ప్రాధాన్యత
ప్రభుత్వ విద్యార్థులు ర్యాంక్ సాధిస్తే.. ప్రైవేట్ ర్యాంకు కొనుక్కుంటుంది
విద్య, వైద్యంకు కేంద్ర బిజెపి పెద్దపీట
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
మన తెలంగాణ/ హుస్నాబాద్ : కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయాలకు తావులేవని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తోకలిసి హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
శనివారం పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ మేరకు విద్యార్థులు, స్థానిక నాయకులు బండి సంజయ్ కు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో గెలిపించిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలంటూ ప్రధాని సూచన మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని.. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాలలో పంపిణీ చేశామని.. నాలుగవ విడతగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే రాబోయే రోజులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో నవోదయ, సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నమన్నారు. దేశ ప్రధాని మోదీ స్ఫూర్తితో మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నంతకాలం సైకిల్ ల పంపిణీ ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే నర్సరీ నుండి ఆరో తరగతి చదివే విద్యార్థులకు బ్యాగ్, స్టీల్ వాటర్ బాటిల్, నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్ తో కలిపి మోదీ కిట్స్ అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత ఉన్న ఉపాధ్యాయులే విద్యను బోధిస్తారని.. ప్రైవేటు పాఠశాలలో అలా ఉండదని.. ప్రైవేటు పాఠశాలలకు వ్యతిరేకం కాదని ర్యాంకులు కొనుక్కునే పాఠశాలకు తాము వ్యతిరేకం అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం విద్య, వైద్యంకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

విద్యార్థులు తల దించుకొని చదివి.. తలెత్తుకొని జీవించాలని.. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు వారి వారి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మొట్టమొదటి ఆస్తి సైకిల్ పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదవండి.. సైకిల్ ను బహుమతిగా పొందండి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పడ్డ కష్టాలు.. అవమానాలు అన్ని ఇన్ని కావని.. వాటిని అధిగమిస్తూ దేశ తలరాతను మార్చిన నేతగా గుర్తింపు పొందారని ఆయన స్ఫూర్తితో ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైన వాటిని అధిగమిస్తూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మేరకు సమాజానికి సహాయం చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు.

ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించడం.. ప్లాస్టిక్ ను నిషేధించాలనే లక్ష్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ నెలకొల్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా కలిసి పనిచేస్తూ మమ్ముల్ని గెలిపించిన హుస్నాబాద్ తోపాటు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మహిళా అధికారులను ఆదర్శంగా తీసుకోవాలి
సిద్దిపేట జిల్లాలో పలు విభాగాలలో సేవలు అందిస్తున్న మహిళ అధికారులను విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా.. ఆర్డిఓ గా సేవలు అందిస్తూనే కలెక్టర్ గా నియమితులై ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హైమావతి.. కష్టపడి చదివి ఐపీఎస్ నుండి ఐఏఎస్ కు సెలెక్ట్ అయి ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్ గా సేవలు అందిస్తున్న గరీమా అగర్వాల్.. వెటర్నరీ డాక్టర్ నుండి ఐపీఎస్ అధికారి స్థాయిలో రాణించి జిల్లా పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాధ లాంటి మహిళా అధికారులను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని.. జిల్లా మహిళా అధికారులే నిదర్శనం అన్నారు.

కార్గిల్ అమరవీరుల త్యాగాలను మరవలేం
దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరుల త్యాగాలను మరువలేమని.. కార్గిల్ దివస్ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. నాడు వాజ్ పేయి.. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని వెల్లడించారు. పై పెహల్కా దాడుల అనంతరం ఎంపీల బృందం అన్ని దేశాల వెళ్లి పాకిస్తాన్ కుట్రలను ప్రపంచానికి తెలియపరచిందని గుర్తు చేశారు.

విద్యార్థులు మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు: జిల్లా కలెక్టర్ హైమావతి
పిల్లలు తెల్ల పేపర్ లాంటి వాళ్ళని.. రాగద్వేషాలు ఉండవని.. మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలని.. వారు ఎన్నుకున్న రంగంలో రాణించేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. విద్యార్థులు పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, మండల విద్యాధికారి బండారి మనీలా తోపాటు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News