మనతెలంగాణ/పెద్దపల్లిప్రతినిధి: ఆగస్టు 15నాటికి రెవెన్యూ సదస్సు దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూశాఖపై అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తు పరిష్కారం, భూ భారతి దరఖాస్తుల, ప్రజావాణి దరఖాస్తులు, మీ సేవా దరఖాస్తులు, రేషన్‌కార్డు దరఖాస్తుల సర్వేపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తిస్థాయిలో డిస్పోజ్ చేయాలని, ఇక నుంచి జిల్లాలో రెవెన్యూ సిబ్బంది సెలవు రోజుల్లో కూడా పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, తహసీల్దార్‌లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.