Monday, July 28, 2025

అద్భత పోరాటం.. రికార్డు సృష్టించిన గిల్, రాహుల్

- Advertisement -
- Advertisement -

మాంచెస్టర్: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతున్న నాల్గవ టెస్ట్‌లో 4వ రోజు ఇంగ్లాండ్ మరోసారి టీమిండియాపై ఆధిపత్యం చెలాయించింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత 669 పరుగులు సాధించింది. దీంతో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాను ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ దెబ్బ కొట్టాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లను డకౌట్ చేసి భారీ షాకిచ్చాడు. దీంతో భారత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎందుర్కొంటూ గిల్(78), రాహుల్(87) ఇద్దరూ అర్ధ శతకాలను బాదారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అద్భుతంగా పోరాడుతున్న ఈ జోడీ అరుదైన రికార్డు సాధించింది. ఈ టెస్టు సిరీస్ లో ఇద్దరూ 500కు పైగా పరుగులు సాధించారు. దీంతో 1971 తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన భారత జోడీగా గిల్(648), రాహుల్(501) నిలిచారు. వీరికంటే ముందు 1948 వెస్టిండీస్ పర్యటనలో విజయ్ హజారే(543)-రుషి మోడీ (560), 1971 వెస్టిండీస్ పర్యటనలో దిలీప్ సర్దేశాయ్(648)- సునీల్ గవాస్కర్(774)లు ఉన్నారు.

డ్రాగా ముగించేందుకు..
కాగా, ఈ మ్యాచ్ లో చివరి రోజు మాత్రమే మిగిలి ఉంది. భారత జట్టు చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ కంటే 137 పరుగులు మాత్రమే భారత్ వెనుకబడి ఉంది. జట్టుకు విజయం దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నందున, టీమిండియా రోజంతా బ్యాటింగ్ చేయాలని.. ఆటను డ్రాగా చేయాలని భావిస్తోంది. మరోవైపు, చివరి రోజు భారత్ ను తొందరగా ఆలౌట్ చేసి విజయం సాధించాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News