వెనుకబడిన కులా(బిసి)లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కంకణబద్ధుడై ఉన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది. ఈ బిల్లు విద్య, ఉద్యోగావకాశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల అంశానికి ముడిపడి ఉంది. కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ బిల్లుకు అంత తేలిగ్గా ఆమోదం పొందదని భావించిన రాష్ట్ర మంత్రివర్గం మరో అడుగు ముందుకేసి ఆర్డినెన్స్ (ముసాయిదా)కు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపించింది. ఈ ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లయితే ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేయాలని ముఖ్యమంత్రి భావన.
అయితే బిల్లు కేంద్రానికి పంపించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మనే అదే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తన ముందుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం (Approval ordinance) తెలుపడానికి వెనుకాడక తప్పలేదు. ఎందుకంటే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా, అదే అంశంపై ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఎలా క్లియరెన్స్ ఇవ్వగలరన్నది ప్రశ్న. దీంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ పంపించారు. తాను ముసాయిదా ఆర్డినెన్స్‌కు క్లియరెన్స్ ఇస్తే ఎదురయ్యే న్యాయ, చట్టపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా? అనే సందేహాలను వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. మరోవైపు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూలును కేంద్రం సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణ జరిగితే మిగతా రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది.
బీహార్ రాష్ట్ర ప్రభుత్వం లోగడ అరవై శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నించగా, సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. తమిళనాడు ప్రభుత్వం 62 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది కదా అనే సందేహాలూ లేకపోలేదు. కానీ రిజర్వేషన్ల చట్టం అమలులోకి రాక ముందే అన్నామలై కాలంలో రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. కాబట్టి ఆ రాష్ట్రంతో పోల్చుకోవడానికి వీల్లేదు. తమిళనాడు ప్రభుత్వం తాజాగా మూడు బిల్లులను గవర్నర్ ఆమోదం లేకుండానే అమలులోకి తీసుకుని వచ్చింది. చట్ట సభలు ఆమోదించి పంపించే బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదం తెలపకపోతే అవి గడువు ముగియగానే చట్టాలుగా మారుతాయని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పడంతో మూడు బిల్లులను గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా అమలు చేస్తున్నది. రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహులు గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభృతులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో రేవంత్ బిసి ఛాంపీయన్‌గా చరిత్రలో నిలబడతారన్న ప్రచారమూ ఊపందుకుంది.
కాగా, వెనుకబడిన కులాలను ఆకర్షించడంలో వెనుకబడి పోతున్నామని బిజెపి రాష్ట్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బిసిలను హైజాక్ చేసిందని, దీనిని అధిగమించి బిసిలను తమ వైపు తిప్పుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం గొప్ప విషయమైనా, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల నగరంలోని ఒక హోటల్‌లో బిజెపి ఒబిసి మోర్చా సమావేశమై తర్జన-భర్జన పడింది. బిజెపి రథసారథిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్.రామచందర్ రావు రెండు రోజుల క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బిసి బిల్లు ఆమోదం పొందడం అంత తేలికయ్యే పని కాదని, దీనికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలును సవరించాల్సి ఉంటుందన్నారు.
అంతేకాకుండా బిల్లును కేంద్రానికి పంపించి నెపం కేంద్రంపై వేసి, రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తున్నదని తూర్పారబట్టారు. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపించింది. బిసి బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపదన్న సంకేతాన్ని రామచందర్ రావు ఇచ్చారన్న అనుమానాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బిసి బిల్లు బంతిని కేంద్రం కోర్టులోకి వేసినందున, కేంద్రం తీసుకునే నిర్ణయంపై కూడా బిజెపి రాష్ట్ర నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రం నో చెబితే ఇక్కడ బిజెపికి చాలా సమస్య ఎదురవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చట్ట సవరణ చేసి బిసిలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందన్న భావన, ఆశ బిజెపి రాష్ట్ర నాయకులకు ఉన్నా అంత తేలికయ్యే అంశమేమీ కాదు.
దానికి ఎన్నో అవాంతరాలు రాకతప్పదు. సుప్రీం కోర్టు ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లు దాట రాదని ఆదేశించింది. అలా చేస్తే ఇతర కులాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, మరే ఏ ఎన్నికలైనా బిసిల ఓట్లే కీలకం కాబట్టి అన్ని పార్టీలూ బిసి అజెండాతో జెండాలు పైకెత్తి ముందుకు సాగుతున్నాయి. బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదించేలా చర్యలు చేపట్టాలని బిఆర్‌ఎస్ నేతల డిమాండ్. కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు చేపట్టకుండా సభలు, సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో కాలయాపన చేస్తున్నదన్న విమర్శల దాడి చేస్తున్నది. ఈ బిల్లును చట్టంగా చేయాలంటూ కోరుతూ బిసి బిల్లును కేంద్రం కోర్టులోకి నెట్టి వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడే బిసిల దయనీయమైన పరిస్థితిని చూసి తాము అధికారంలోకి రాగానే బిసిలకు సరైన గుర్తింపు ఇచ్చేందుకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. అయితే కేంద్రంలో అధికారంలోకి రాలేకపోవడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాహుల్ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రయత్నించారన్నది స్పష్టమవుతున్నది. బిసి రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం చట్టంగా మార్చకపోతే నెపం ఎన్‌డిఎపైనే పడుతుందన్నది మరో వాదన. ఎన్నికల సమయంలో నెపం కేంద్రంపై వేసేలా కాంగ్రెస్‌కు ఓ అస్త్రం సిద్ధమైంది. దీనిని తిప్పికొట్టేందుకు బిజెపికి ఇప్పుడు ఆయుధం కావాలి. కాబట్టి జనగణనతో పాటు కులగణనకు శ్రీకారం చేపడతామని ప్రకటించింది. రేవంత్ రెడ్డి కదిలించిన బిసి బిల్లు తేనె తుట్టె అన్ని పార్టీలనూ ఇరకాటంలో పెట్టింది.
- వీరన్న గారి ఈశ్వర్ రెడ్డి