Monday, July 28, 2025

ఇజ్రాయెల్‌ను ఒంటరి చేయడమే ఏకైక మార్గం!

- Advertisement -
- Advertisement -

గాజాలో ఇజ్రాయెల్ సామూహిక నరమేధానికి పాల్పడుతున్నది. ఒకజాతి మొత్తాన్ని సంహరించేలా చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజుకు వందలాది మందిని హత్య చేస్తున్నది. మానవతా సహాయం, ఆహారం, వైద్య కోసం ఎదురుచూస్తున్న వారిపై సైతం బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో 2023 అక్టోబర్ నుంచి సుమారు 60-80 వేల మంది వరకు మరణించారని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ, నేచర్ నివేదికల ద్వారా స్పష్టమవుతున్నది. ఇందులో సుమారు 18 వేల మంది చిన్నారులు ఉండగా, 15 వేల కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. రెండు వేల మంది వరకు వృద్ధులు ఉన్నట్టు అంచనా. గాజాలో మరణించిన వారిలో 59.1 శాతం మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారని లాన్సెట్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధం వల్ల ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సామాగ్రి వంటి ప్రాథమిక అవసరాలు కూడా గాజాకు అందడం లేదు.

దీనివల్ల ఆకలి చావులు, వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ఆకలితో మరణించినట్టు పలు రిపోర్టుల ద్వారా తెలుస్తున్నది. ఇందులోనూ 80 శాతం మంది చిన్నారులు ఉండడం మనసులను కలచివేస్తున్నది. గత కొన్ని రోజుల్లో ఆహార సహాయ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 875 సాధారణ మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదించింది. అంతేకాకుండా సుమారు 19 లక్షల మంది నిర్వాసితులుగా మారారు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని, మానవతా సహాయానికి అనుమతించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇటీవల 28 దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

ఇందులో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐస్‌లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, గ్రీస్, మాల్టా, సైప్రస్ దేశాలు ఉన్నాయి.కాగా, వీరి డిమాండ్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. దీన్ని బట్టి చూస్తే ఈ 28 దేశాలు ప్రకటనలకే పరిమితమైతే ఎలాంటి లాభం ఉండదని స్పష్టమవుతున్నది. ఇజ్రాయెల్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశాన్ని ఒంటరిచేసేలా కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరమున్నది. గాజాలో యుద్ధ విరామం, మానవతా సహాయం అందేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా ఇప్పటికే పలు దేశాలు చర్యలు మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్ చర్యల కారణంగా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాల్సిన అవసరముందని ఇయు విదేశాంగ విధాన ప్రధాని కాజా కల్లాస్ ప్రకటించారు.

యుకె ఇప్పటికే ఇజ్రాయెల్‌తో వాణిజ్య చర్చలను నిలిపివేసింది. ఇజ్రాయెల్‌కు ఆయుధ బదిలీలు ఆపాలని యుఎన్ నిపుణులు సైతం హెచ్చరించారు. యుకె, మరికొన్ని దేశాలు ఆయుధ లైసెన్సులను కొంతవరకు నిలిపివేశాయి. బెలిజ్ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నిలిపివేసింది. ఐర్లాండ్, నార్వే, స్లోవేనియా, స్పెయిన్ 2024లో పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మాక్రోన్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపడానికి, మానవతా సంక్షోభాన్ని నివారించడానికి ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. అంటే ఫ్రాన్స్ జి7 దేశాల్లో పాలస్తీనాను దేశంగా గుర్తించే మొట్టమొదటి రాజ్యంగా నిలవనుంది. గాజాలో నరమేధాన్ని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.

యుద్ధ నేరాలకు గాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఇజ్రాయెల్ పై కఠిన ఆంక్షలు విధించడం ద్వారానే ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ముందుగా ఆయుధాల ఎగుమతులపై పూర్తి నిషేధం విధించాలి. పాలస్తీనాకు దేశ గుర్తింపును ఇవ్వడం ద్వారా దీర్ఘకాలిక మద్దతు అందించవచ్చు. ఐసిజె, ఐసిసి వంటి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై మరిన్ని కేసులు వేసి చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేయొచ్చు. గాజాలో 92% గృహాలు, 88% పాఠశాలలు ధ్వంసమయ్యాయని యుఎన్ నివేదికలు స్పష్టం చేశాయి. ప్రపంచ దేశాలు గాజా పునర్నిర్మాణానికి నిధులను కేటాయించడం ద్వారా దీర్ఘకాలిక సహాయాన్ని అందించవచ్చు.ఇది విద్య, ఆరోగ్యం, జీవనోపాధికి దోహదపడుతుంది.

మరోవైపు అన్ని దేశాల ప్రజలు సైతం ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచే చర్యలకు సిద్ధం కావాల్సిన అవసరమున్నది. ఇప్పటికే అనేక దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇది ఆయా దేశాలు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయగలవు. బాయ్ కాట్, డైవెస్ట్‌మెంట్, శాంక్షన్స్ (బిడిఎస్) ఉద్యమం ద్వారా ఇజ్రాయెల్‌తో వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని యూరోపియన్ దేశాలను కోరుతున్నారు. రఫా క్రాసింగ్ ద్వారా ఆహారం, నీరు, వైద్య సామాగ్రిని గాజాకు చేరవేయడానికి ఈజిప్ట్‌తో సమన్వయం చేసుకోవాల్సిన అవసరముంది. 28 దేశాల సంయుక్త ప్రకటన గాజా సంక్షోభాన్ని ఖండించడంలో ఒక ముఖ్యమైన అడుగు. కానీ ఇది కేవలం మౌఖిక సందేశంగా మిగిలిపోకూడదు. గాజాలో నిరాయుధులు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, ఆకలి చావులు, మానవతా సంక్షోభాన్ని నివారించడానికి ఈ దేశాలు ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించే ధైర్యం చేయాలి. అప్పుడే గాజా ప్రజలకు న్యాయం సాధ్యమవుతుంది.

  • మహమ్మద్ ఆరిఫ్, 70131 47990
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News