వాషింగ్టన్: థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. థాయిలాండ్-కంబోడియా నాయకులు కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌ను పర్యటనలో ఉన్న ట్రంప్.. కాంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్, థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో విడివిడిగా మాట్లాడినట్లు ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. కాల్పులు కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని ఆయన ఇరు దేశాలను హెచ్చరించారు.
“రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణ, శాంతి కోసం చర్చించేందుకు సిద్ధమయ్యాయి. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని కోరుకుంటున్నారు. అమెరికాతో వాణిజ్యం కొనసాగాలంటే యుద్ధాన్ని ఆపాల్సిందేనని స్పష్టం చేశా. వారు వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించారు. రెండు దేశాలతోనూ వ్యవహరించడం గౌరవంగా ఉంది. వారికి సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతి ఉంది. వారు రాబోయే చాలా సంవత్సరాలు కలిసి ఉంటారని ఆశిస్తున్నాను” అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.
కాగా, సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఇరువైపుల దాదాపు 33 మంది మరణించగా.. 1,68,000 మందికి పైగా నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది. ఇక, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన వైమానిక దాడుల సమయంలోనూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలతో తాను చర్చించానని.. వారు కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు దేశాలు కాల్పులను విరమిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.