మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తీవ్రంగా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించి టీం ఇండియాకు సవాల్ విసిరింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ సున్న పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్(87), గిల్ (78) ఉన్నారు. భారత్ ఆధిక్యంలోకి రావాలంటే ఇంకా 137 పరుగులు చేయాలి. (Rishabh Pant)
ఈ పరిస్థితిలో భారత్ ఓడిపోకుండా ఉండాలి అంటే.. కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి లోటును పూరించుకొని.. అదనంగా 200 పరుగులు అయినా చేయాలి. లేదా ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. కాబట్టి ఇప్పుడున్న బ్యాటర్లు కనీసం ఒక్క సెషన్ పాటు ఇంగ్లండ్ బౌలర్లను ఎదురుకొవాలి. ఆ తర్వాత బ్యాటింగ్ భారమంతా.. రిషబ్ పంత్‌పై (Rishabh Pant) పడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయినా గాయాన్ని లెక్క చేయకుండా పంత్ బ్యాటింగ్‌కి వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. కీపింగ్ మాత్రం ధృవ్ జురేల్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితిలో పంత్ బ్యాటింగ్‌కి వస్తాడా..? రాడా..? అనే విషయంలో అంతా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంత్ రెండో ఇన్నింగ్స్‌లో కచ్చితంగా బ్యాటింగ్ చేస్తాడని.. కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా ధృవీకరించాడు.
‘‘ప్రస్తుత పరిస్థితిలో ప్రతి బంతి కీలకమే. ప్లాన్ ప్రకారం కాకుండా.. అప్పటికప్పుడు బంతిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రిస్క్ షాట్లకు పోవద్దు. ఒక్కసారి కుదురుకున్నాక అప్పుడు షాట్లు ఆడితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా బ్యాటింగ్ చేసేవాళ్లంగా అనుభవం ఉన్నావాళ్లే. ఇప్పుడు స్కిల్ కంటే మానసికంగా బలంగా ఉండాలి. ఆ విషయంలో రిషబ్ పంత్ ముందుంటాడు. రెండో ఇన్నింగ్స్‌లో తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని అనుకుంటున్నా’’ అని సితాన్షు పేర్కొన్నాడు.