సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌లో (Srushti Test Tube Center) జరిగిన ఘటన వివరాలను డిసిపి రేష్మీ పెరుమాళ్ వెల్లడించారు. అసలు డాక్టర్ నమ్రత సరోగసీ చేయలేదని స్పష్టం చేశారు. ‘‘సంతానం కలగని దంపతులు సృష్టి ఆస్పత్రికి వెళ్లారు.. వారికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఐవిఎఫ్ సాధ్యం కాదని చెప్పారు. సరోగసీ ద్వారా సంతానం పొందవచ్చని దంపతులకు డాక్టర్ నమ్రత చెప్పారు. అందుకోసం రూ.30 లక్షలు ఖర్చవుతాయని.. సరోగసీకి విశాఖకు చెందిన దంపతులను ఒప్పించానని డాక్టర్ తెలిపారు. ఆ దంపతులు రూ.5 లక్షలు అడిగారని డాక్టర్ అన్నారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసి చేస్తున్నామని చెప్పారు. సరోగసీ మదర్ అని విశాఖలో ఒక గర్భణీని దంపతులకు చూపించారు. కొన్నాళ్ల తర్వాత విశాఖ ఆస్పత్రిలో ఒక బాబును దంపతులకు ఇచ్చారు’’ అని డిసిపి తెలిపారు.
‘‘సరోగసీ మదర్ అదనపు డబ్బులు అడుగుతున్నారని కూడా చెప్పారు. డాక్టర్ అడిగిన అదనపు డబ్బును కూడా దంపతులు ఇచ్చారు. అయితే ఈ కేసులో డాక్టర్ నమ్రత అసలు సరోగసీ చేయలేదు. అసోంకు చెందిన మహిళ నుంచి అప్పుడే పుట్టిన శిశువును తీసుకున్నారు. ఆ తల్లికి రూ.90 వేలు చెల్లించి పుట్టగానే శిశువును తీసుకున్నారు. అయితే శిశువు విషయంలో దంపతులకు అనుమానం వచ్చింది. డిఎన్‌ఎ టెస్టు చేయించారు. దీంతో శిశువు దంపతులకు సంబంధించినది కాదని తేలింది. ఇది సరోగసీ కాదు.. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశాం. ఏడుగురు నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేశాం’’ అని డిసిపి వెల్లడించారు. (Srushti Test Tube Center)
అయితే సృష్టి ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత గతంలో కూడా పలు మోసాలకు పాల్పడ్డారని డిసిపి పేర్కొన్నారు. 2021లోనే ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్‌కు గడువు తీరిందని.. ఆస్పత్రికి అనుమతులపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని వెల్లడించారు. కేసులు ఉన్నందున ఆస్పత్రిని మూసివేస్తున్నామని కోర్టుకు తెలిపారని డిసిపి స్పష్టం చేశారు.