భూపాలపల్లి: బిఆర్‌ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం బిఆర్ఎస్ ఉంటుందని ఆయన అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘తెలంగాణ ఉన్నంతవరకూ బిఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. పలు పార్టీలకు చెందిన నేతలు బిఆర్‌ఎస్.. బిజెపిలో కలుస్తుందని ఏదేదో మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ఎక్కడికి పోదు. ఎవ్వరితో కలిసే ఖర్మ మనకు లేదు. కెసిఆర్ మళ్లీ సిఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. ప్రభుత్వాన్ని నడిపేందుకు లంకెబిందెలు, గల్ల పెట్టేలో పైసలు కాదు.. దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపేటోడు మొగోడైతే.. నడిపేటోడికి దమ్ముంటే పనైతది. మా పాలనలో కరోనా సంక్షోభంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు నడిపినోడు కెసిఆర్’’ అని కెటిఆర్ (KTR) అన్నారు.