బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు పార్టీని నడిపే ఓపిక, శక్తి లేకనే విశ్రాంతి తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కెసిఆర్‌ను కాపాడే శక్తులు లేవు, బిఆర్‌ఎస్‌ను బతికించుకునే పరిస్థితులూ లేవని ఆయన తెలిపారు. కెసిఆరే చేతులెత్తేసిన తర్వాత ఇక మీతో ఏమి అవుతుంది? అని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రులైన టి. హరీష్ రావు, కె. తారక రామరావునుద్దేశించి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. మీ భాషను మార్చుకోకపోతే బి—టీం వస్తదని, అప్పుడు తట్టుకోలేరని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లోనే బిఆర్‌ఎస్‌ను ప్రజలు బండకేసి బాదారని ఆయన తెలిపారు. కాలం చెల్లిన బిఆర్‌ఎస్‌ను బతికించుకోవడం మీ వల్ల కాదన్నారు. ఇంకా వంద మంది కెసిఆర్‌లు వచ్చినా బిఆర్‌ఎస్‌ను బతికించుకోవడం కష్టమని అద్దంకి వ్యాఖ్యానించారు.