Monday, July 28, 2025

రైతులను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎంఎల్‌ఎసి కవిత

- Advertisement -
- Advertisement -

రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆదివారం హన్మకొండ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆమెమాట్లాడుతూ.. తనది కూడా ఓ రైతు కుటుంబమేనని, తాను పొలంలో నాట్లు వేసిన వ్యక్తినని, రైతుల బాధలు ఎలా ఉంటాయనేది తెలుసునని అన్నారు. జూటా మాటలతో జూటా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ రైతులను అరిగోస పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వరంగల్‌లో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రైతుల డిక్లరేషన్ హామీలు చేసిందని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రైతు డిక్లరేషన్ హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు.

అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిందని, ఇప్పటికీ 50% మందికి కూడా చేయలేదని మండిపడ్డారు. మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు వేస్తున్నారని చెపుతూ వస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా గెలిచిన నాటి నుంచి ఎప్పుడూ ఫ్లైట్ మోడులోనే ఉంటాడని, ఢిల్లీకి పోవడం…రావడంలో ఆఫ్ సెంచరీ దాటిందని ఎద్దేవా చేశారు. ఒక్కసారైనా రైతుల సమస్యలు ప్రధాని మోడీకి వివరించలేదన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఊదరగొడుతున్నారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో కల్తీ విత్తనాలు లేకుండా అరికట్టామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపణల వర్షం కురిపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధర్మసాగర్ దేవాదుల ప్రాజెక్టు పంప్‌హౌస్ పూర్తి చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మిము పూర్తి

చేశామని చెప్పుకుంటూ దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేసి మోటార్ ఆన్ చేస్తే.. పైపులు పగిలిపోయాయని అన్నారు. చరిత్ర గల వరంగల్ నగరంలోకి విమానాశ్రయం రావడం గొప్ప విశేషమని అన్నారు. మామునూర్ విమానాశ్రయానికి రాణి రుద్రమ దేవి పేరు పెట్టాలని సూచించారు. ఆగస్టు 6న జయశంకర్ జయంతి ఉత్సవాలను వరంగల్‌లో తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తామనేది త్వరలోనే కార్యాచరణ కూడా రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూకల రాణి, తెలంగాణ జాగృతి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాధవి లత, భారత జాగృతి విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంతచారి, స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత, తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News