టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పుకు అనుగుణంగా సేవలు
దేశార్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అగ్రసేన్ బ్యాంక్ అమీర్ పేట్ బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారని, కానీ ఇప్పుడా నిర్వచనం మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల సేవలను అందిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం అగ్రసేన్ బ్యాంక్ అమీర్ పేట్ బ్రాంచ్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం అని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో ఇవి ముందున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికి పైగా ప్రజలు వీటి సేవలను వినియోగించుకుంటున్నారని, మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 5.5 లక్షల కోట్ల మార్కును దాటాయి’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తి 66.7 శాతం : తెలంగాణలో 48 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు 321 శాఖల ద్వారా అర్బన్, సెమీ – అర్బన్ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి బిజినెస్ టర్నోవర్ రూ.17వేల కోట్లుగా ఉందని వివరించారు. క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తి 66.7 శాతం. కూకట్ పల్లి, మలక్ పేట్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ మోడల్ ‘పాథ్’ : సహకార బ్యాంకులు లాభాపేక్షతో కాకుండా, ఖాతాదారుల ప్రయోజనాల కోసం కమ్యూనిటీ ఆధారిత సేవలను అందిస్తున్నాయని చెప్పారు. కేర్(కమ్యూనిటీ ఫోకస్డ్, అఫర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ క్రెడిట్, రిలేషన్‌షిప్ బేస్డ్ బ్యాంకింగ్, ఎంపవరింగ్ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్) మోడల్‌లో పని చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగ బ్యాంకుల అభివృద్ధికి పాథ్ (పాలసీ సపోర్ట్, యాక్సెస్ టూ డిజిటల్ టూల్స్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, హైబ్రిడ్ ఫైనాన్స్ ఎకోసిస్టమ్స్) మోడల్‌ను అనుసరిస్తుందన్నారు. యువత, వెనుకబడిన వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ అనుసంధానాలు, గ్రీన్ లోన్స్ వంటి పథకాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా, టిబారుమల్ జ్యూవెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాంభరోసే గుప్తా, సోమాని ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అశోక్ కుమార్ సోమాని, అగ్రసేన్ బ్యాంక్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ ఖేడియా, సీనియర్ వైస్ ఛైర్మన్ నవీన్ కుమార్ అగర్వాల్, వైస్ ఛైర్మన్ సురేష్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.