Friday, September 12, 2025

అక్రమాల సృష్టి

- Advertisement -
- Advertisement -

సంతానలేమి జంటలే టార్గెట్‌గా నడుస్తున్న ఓ టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్ నిర్వాకం బట్టబయలైంది. రాజస్థాన్‌కు చెందిన దంపతులు నగరంలో నివాసముంటున్నారు. సంతానం లేకపోవడంతో సంతానం కోసం సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో సెంటర్ నిర్వాహకులు దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించి సంతానం కలుగదని సరోగసీ ద్వారా సంతానం కలిగిస్తామని నమ్మబలికి మొదటి విడతగా 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. తొమ్మిది నెలల తరువాత తన భర్త వీర్యంతో సరోగసీ ద్వారా బిడ్డ పుట్టాడని మరో 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుట్టిన బిడ్డ అనారోగ్యంగా ఉండటంతో అనుమానం వచ్చిన రాజస్థాన్‌కు చెందిన దంపతులు డిఎన్‌ఏ టెస్ట్ చేయించగా అసలు విషయం బయటపడింది. పుట్టిన బిడ్డ డిఎన్‌ఏ సరిపోకపోవడంతో అనుమానం వచ్చిన వారు సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నార్త్‌జోన్ డిసిపి రష్మీ పెరుమాల్ నేతృత్వంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, రెవెన్యూ సిబ్బందితో శనివారం సాయంత్రం నుండి ఆదివారం తెల్లవారు జాము వరకు ఆసుపత్రిలో క్షుణంగా తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్న సిబ్బంది, టెక్నీషియన్‌లను విచారించి కీలక పత్రాలను, శాంపుళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వైద్య విధాన పరిషత్ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకున్న వైద్యాధికారులు ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్‌ను రద్దు చేసి టెక్నిషియన్‌లతో పాటు నిర్వాహకురాలు నమ్రతను అరెస్టు చేశారు. విజయవాడలో ఉన్న సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను విజయవాడలో అరెస్టు చేసి సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం నార్త్‌జోన్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటీ కలిసి సంయుక్తంగా డిసిపి రష్మీ పెరుమాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్, డిసిపి రష్మీ పెరుమాల్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులే లక్షంగా నియమ నిబంధనలకు విరుద్ద్ధంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ నిర్వహిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని, ఈ సెంటర్‌పై గతంలో కూకట్‌పల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని, అక్రమంగా నడుస్తున్న ఈ సెంటర్‌ను గతంలో లైసెన్స్ రద్దు చేసినప్పటికీ మరో వైద్యరాలి పేరుతో అక్రమ టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌ఫెర్టిలిటీ సమస్య తీవ్రంగా ఉందని ఈ క్రమంలోనే పుట్టగొడుగుల్లా ఫెర్టిలిటీ సెంటర్‌లు వెలుస్తున్నాయని తెలిపారు. వైద్య విధాన పరిషత్ నియమనిబంధనలకు లోబడి సరోగసీ చేయాలని అలా కాకుండా అక్రమంగా చేయడం నేరమన్నారు. దంపతుల బలహీనతనలు ఆసరాగా తీసుకొని ఇతరుల వీర్యంతో సంతానోత్పత్తి చేయడం చట్టవిరుద్ధ్దమన్నారు. సంతానం కల్పిస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.

సరోగసీపై ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలు విధించిందని అన్‌లైన్‌లో సెర్చ్ చేసిన సరోగసీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయని ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం నడుచుకోవాలని సంతానలేమి దంపతులకు సూచించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలితోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఆమె తెలిపారు. సరోగసీ పేరుతో చంటిపిల్లల అమ్మకాలు చేస్తున్నట్టు, యువకుల వీర్యాన్ని సేకరించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని మరింత లోతుగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌లపై నిఘా పెడతామని ఎవరికైనా అనుమానాలు ఉంటే పోలీసులను సంప్రదించాలని డిసిపి రష్మీ పెరుమాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News