ఆస్ట్రేలియాలో 33 సంవత్సరాల భారతీయ సంతతి వ్యక్తి సౌరభ్ ఆనంద్‌పై దుండగులు దాడి జరిపారు.ఈ ఘటనలో ఆయన చేయి పూర్తిగా తెగిపోయింది. చికిత్స జరిపిన వైద్యులు దీనిని అతికించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి లేదు. అయితే ఇంతకు ముందు కూడా ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి విద్యార్థిపై జాత్యాహంకార దాడి జరగడంతో స్థానిక భారతీయ సంతతి ఆందోళన చెందుతోంది. గతవారం సౌరభ్‌పై దాడి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ మెడికల్ షాప్ నుంచి ఇంటికి వెళ్లుతున్న ఆనంద్‌ను దుండగులు అటకాయించారు. తమ చేతుల్లో ఉన్న పొడవాటి కత్తితో దాడికి దిగారు.ఈ క్రమంలో ఆయన చేయి తెగిందని వెల్లడైంది.
ఈ నెల 19వ తేదీన స్థానిక అల్టోనా మెడోస్ ప్రాంతంలో ఓ ఫార్మసీ దుకాణంలో అవసరం అయిన మందులు తీసుకుని వెళ్లుతుండగా స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. పక్కనే నిలబడి మాట్లాడుతూ ఉండగా ఈ యువకుల ఆకతాయి ముఠా ఆయనను చుట్టుముట్టి దాడికి దిగింది. ముందు ప్యాకెట్లలో డబ్బు కోసం వెతికారు. తీవ్రంగా కొట్టడంతో కింద పడ్డ ఆయన గొంతు నరికేందుకు కత్తి దూశారు. తప్పించుకునేందుకు చేయి అడ్డం పెట్టిన ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. చేయి విరిగింది. అయినా ఆగకుండా దుండగులు ఆయనను పలు చోట్ల పొడిచి వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్సతో ప్రాణాపాయం తప్పింది.