రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’ (Rangasthalam). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రామ్ చరణ్ యాక్టింగ్‌ని రంగస్థలం ముందు.. రంగస్థలం తర్వాత అని అనే అంతలా ప్రభావం చూపించింది ఈ సినిమా. 2018లో విడుదలైన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, సీనియర్ నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
అయితే ఈ సినిమా (Rangasthalam) ఏడేళ్ల తర్వాత త్వరలో టివిలో తొలిసారి ప్రసారం అవుతుందట. అదేంటి రంగస్థలం ఇప్పటికే రంగస్థలం చాలాసార్లు టివిలో చూశామని అనుకుంటున్నారా..! అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. తొలిసారిగా ఈ సినిమా హిందీ భాషలో టివిలో ప్రసారం కానుంది. ఆగస్టు 24న తేదీన 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ఛానెల్‌లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో హిందీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.