శ్రీశైల జలాశయానికి సోమవారం భారీ వరద నమోదైంది. ఎగువ జూరాల సుంకేసుల బ్యారేజీల నుంచి 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి లక్షా ఎనిమిది వేల క్యూసెక్కులు దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ద్వారా మరో 67వేల క్యూసెక్కులు కలుపుకుని మొత్తం లక్షా 74 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. టిఎంసీలలో 215 టిఎంసీలకు గాను 204 టిఎంసీలు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి
90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 10 గేట్లు ఎత్తి లక్షా క్యూసెక్కులు శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 27 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి సుంకేసుల బ్యారేజికి 97 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 17 గేట్లను ఒక మీటర్ మేర దిగువ శ్రీశైలం వైపుకు 95 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అటు జూరాల, ఇటు సుంకేసుల నుంచి భారీగా వరద శ్రీశైలం వైపుకు వస్తుండడంతో జలాశయం నిండుకుండగా మారింది. మరో వారం రోజుల పాటు హెచ్చుతగ్గుల మధ్య వరద కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.