మన తెలంగాణ/దేవరుప్పుల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరుప్పుల మండలంలోని చిన్న మడూరు గ్రామంలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశంలో ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రామస్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారన్నారు. చిన్న మడూరు, రంభోజిగూడెం గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలే అన్నారు.
గతంలో మోసపోయిన ప్రజలు ఈసారి తెలివిగా నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే పేదల భద్రత, రైతులకు న్యాయం, యువతకు ఉపాధి అంశాలు సాధ్యమవుతాయన్నారు. స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలు, యువత భాగస్వామ్యం, మహిళాభివృద్ధిపై పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్షంగా ప్రతీ ఒక్కరూ సమష్టిగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, మహిళా శక్తి, యువజన విభాగాలు కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించారు.