Wednesday, July 30, 2025

పహల్గాం సూత్రధారి హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: భద్రతా బలగాల తీవ్రస్థాయి ఎన్‌కౌంటర్ లో సోమవారం ఉదయం ముగ్గురు పాకిస్థానీ ఉ గ్రవాదులు హతులయ్యారు. శ్రీనగర్ శివార్లలోని లిద్వాస్‌లో ఆపరేషన్ మహాదేవ్ పేరిట సాగిన చర్యలో మృతి చెందిన ఒక ఉగ్రవాదిని పహల్గాం ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి సులేమాన్ షా అలియాస్ మూసాగా గుర్తించారు. లోకసభలో ఓ వైపు పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై సుదీర్ఘ చర్చను రక్షణ మంత్రి ఆరంభించిన దశలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది, ఉగ్రవాద చర్యలో ప్రధాన వ్యక్తి హతుడయ్యాడు. సైన్యం, సిఆర్‌పిఎప్, స్థాని క పోలీసు బలగాల సమన్వయంతో ఆపరేషన్ జరిగింది. మృతులలో మరో వ్యక్తి యాసిర్‌కు కూడా పహల్గాం దాడితో సంబంధం ఉన్నట్లు గుర్తించా రు. ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ లష్క రే తోయిబాలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. మృతుల ఫోటోలు వారి పేర్లను వివరాలతో పత్రికలకు వెలువరించారు. సులేమాన్‌తో పాటు అబూ హంజా, యాసీర్ హతులు అయ్యారు. సులేమాన్ గతంలో పాకిస్థాన్ సైన్యంలో పనిచేశాడు. అక్కడ హషీం మూసాగా చలామణి అయ్యారని వెల్లడైంది. సై న్యం వీడిన తరువాత ఉగ్రవాద దళంలో చేరాడు. ఎప్రిల్‌లో పహల్గాం పర్యటనకు వచ్చిన కుటుంబాలలో కొందరిని ఎంచుకుని ఉగ్రవాదులు జరిపిన భయానక కాల్పుల్లో 26 మంది చనిపోయారు.ఈ ఘటన దేశవ్యాప్తంగా కలవరం, నిరసనలకు దారితీసింది.

అప్పటి ఘాతుకంలో పాల్గొన్న ఉగ్రవాదులను ఇప్పటి వరకూ ఏరివేయలేదు. ఈ క్రమంలో సంబంధిత ఘటనలో పాల్గొన్న ఇద్దరు హతులు కావడం ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్‌లో విజయఘట్టంగా మారింది. కొనసాగే ఆపరేషన్ సిందూర్ అంతర్భాగంగానే ఇప్పుడు ఈ మహాదేవ్ చర్యకు దిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాం తంలో ఉగ్రవాదుల సంచారం ఉందని , కీలక ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు అత్యంత చాకచక్యంగా ఈ దాడికి దిగాయి. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులలో ఉగ్రవాదులు మకాం వేసుకుని ఉన్న స్థావరం నుంచి భారీ స్థాయిలో మారణాయుధాలను స్వాధీనపర్చుకున్నారు.ఎకె 47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రనైడ్స్, ఇతర నాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇక్కడ దొరికింది. ఇక్కడ నక్కి ఉండి వీరు ఇతరులతో కలిసి జమ్మూ కశ్మీర్‌లో మరో భారీ స్థాయి దాడికి వ్యూహరచన సాగించారని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలోని ఎతైన కొండశిఖరం మహదేవ్ పై మకాం వేసుకుని ఉన్న వీరిని భద్రతాబలగాలు ఈ పేరిట ఖరారు చేసుకున్న చర్యతోనే తుదముట్టించాయి.

4 రోజుల ఆపరేషన్ ..పహల్గాం ఉగ్రవాదుల హతమే లక్షం
పహల్గాం ఉగ్రదాడికి సరైన ప్రతీకారం దిశలో భద్రతా బలగాలు తలపెట్టిన ఆపరేషన్ మహాదేవ్‌ను సైనిక దళాల సుశిక్షిత విభాగాల ఆధ్వర్యంలో చేపట్టారు. పహల్గాం ఉగ్రవాదుల నిర్మూలన , తగు ప్రతీకారం లక్షంగానే ఈ చర్యకు దిగారు. పలు ప్రాంతాలలో సమాచార సేకరణ , ఉగ్రవాదుల సంచారంపై కదలికలతో అత్యంత జాగ్రత్తగా 14 రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. ఉగ్రవాదుల సంచారం ఉందని తెలిసిన చోట ఏర్పాటు చేసిన పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, అధునాతన సిసికెమెరాలతో నిఘాను తీవ్రతరం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడెక్కడ తిరుగుతున్నది ఈ నెల ఆరంభం నుంచి ఖచ్చిత రీతిలో అందింది. ఇక వారు తప్పించుకునే వీలు లేని ప్రాంతంలో ఉన్నప్పుడే వారిని చుట్టుముట్టి కాల్చివేశారని, ఈ క్రమంలో వారి నుంచి కూడా ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. ఈ ప్రాంతంలోనే చైనాకు చెందిన ఓ అధునాతన రేడియో కమ్యూనికేషన్ సెట్ పనిచేస్తున్న విషయాన్ని సైనిక సాంకేతిక విభాగం గుర్తించింది. దీనిని ట్రాక్ చేసుకుని ఎప్పటికప్పుడు దీని ద్వారానే ఉగ్రవాదుల అడుగుజాడలను గుర్తించారు. తరువాతి క్రమంలో 14వ రోజు ఈ ఆపరేషన్ విజయవంతం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News