ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ 31నుంచి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి
మీనాక్షి నటరాజన్, పిసిసి సారథి
మహేశ్ కుమార్ పాదయాత్ర వచ్చే
నెల 6వ తేదీ వరకు కొనసాగనున్న
పాదయాత్రలు, శ్రమదానం,
పల్లెనిద్ర బిసి రిజర్వేషన్లపై విపక్ష
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ఎత్తుగడ
31న పరిగి నియోజకవర్గం
నుంచి ప్రారంభం ఆంధోల్,
ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి,
వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో
సాగనున్న యాత్ర
మన తెలంగాణ/హైదరాబాద్/ ప్రత్యేక ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిముఖ కార్యాచరణ సిద్ధం చేసింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్న లక్షంగా ఈ నెల ౩1 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ పాదయాత్ర, శ్రమదానం, పల్లె నిద్ర చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాచరణ సిద్ధం చేశారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే, ప్రతిపక్షాల నాయకులు ముప్పేట దాడి చేయడాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు ఉచి త బస్సు, వ్యవసాయానికి
నాణ్యమైన విద్యుత్తు, పేదలకు సన్న బియ్యం, సన్న బియ్యం పండించే రైతులకు సబ్సిడీ అందించడం ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల గురిం చి ప్రజలకు వివరించేందుకు మూడు కార్యక్రమాలను రూపొందించారు. ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పది కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని, అనంతరం పల్లె నిద్ర చేయాలని, మర్నాడు ఉదయం శ్రమదానం చేయాలని, అనంతరం స్థానికంగా సభలు, సమావేశాలు, వీలును బట్టి ఫంక్షన్ హాళ్ళలో సమావేశాలు నిర్వహించాలని, ఇంకా వీలైతే పెద్ద ఎత్తున కార్యకర్తలతో, ప్రజలను మమేకం చేస్తూ సభలు నిర్వహించాలని మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లూ హాజరుకావాలని వారు నిర్ధేశించారు.
తొలి విడత షెడ్యూలు ఇలా..
ఈ మేరడు తొలి విడత షెడ్యూలును ఖరారు చేశారు. తొలుత రంగా రెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో శ్రీకారం చుట్టనున్నారు. 31న సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభించి పది కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం అక్కడే కార్యకర్తలతో, స్థానిక గ్రామీణులతో కలిసి భోజనం చేసి పల్లె నిద్ర చేయాలని నిర్ణయించారు. మర్నాడు ఉదయం అంటే ఆగస్టు 1న పరిశుభ్రత కోసం శ్రమదానం చేసి, మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కార్యకర్తలకు వివరిస్తారు.
1వ తేదీన మెదక్ జిల్లా ఆందోలు ఎస్‌సి నియోజకవర్గం కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది, పాదయాత్ర ముగిసిన తర్వాత భోజనం చేసి, అక్కడే పల్లె నిద్ర చేస్తారు. మర్నాడు (2న) ఉదయం శ్రమదానం చేయడం, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం (2న) నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ నియోజకవర్గంలో పాదయాత్ర, పల్లె నిద్ర, మర్నాడు (౩న) శ్రమదానం, భోజన విరామం, కార్యకర్తలతో సమావేశమవుతారు. 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో, 5న కరీనంగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో, 6న వరంగల్ జిల్లా వర్దన్నపేట (ఎస్‌సి) నియోజకవర్గంలో ఇదే పద్ధతిన పాదయాత్ర, పల్లె నిద్ర, మర్నాడు శ్రమదానం, భోజన విరామం అనంతరం సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన కార్పోరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు తప్పని సరిగా హాజరుకావాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు.
విజయవంతానికి కమిటీ
ఈ తొలి విడత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేసి జిల్లా ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఇతర ముఖ్యులతో చర్చించి, సమన్వయం చేసేందుకు వీలుగా మీనాక్షి సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ కమిటీని ప్రకటించారు. కమిటీలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డాక్టర్ కాతూరి వెంకటేష్, జూలూరు ధనలక్ష్మి, డాక్టర్ పులి అనిల్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఆయా జిల్లా అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ పలు సూచనలతో పాటు రూట్ మ్యాప్‌నూ పంపించారు.