Wednesday, July 30, 2025

సీతారామ అంచనాల సవరణకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థనకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్ల వరకు అనుమతిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలలో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. ప్రధాన పంట కాలువలు అన్ని ఆధునీకరణ, మరమ్మత్తులు చేపట్టనున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయనిగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిలుస్తుందని, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల అడిగిందే తడువుగా సీఎం రేవంత్ రెడ్డి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి శరవేగంగా పనులు ప్రారంభించాలని సూచించారు.

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానుంది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 11 నియోజకవర్గాలు 31 మండలాల్లో 3.29లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 3.45లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు సాగుబడిలోనికి వస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104 కిలోమీటరు వరకు పూర్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంట కాలువలు ఆధునికరణ మరమతులు చేపట్టనున్నారు. సత్తుపల్లి ట్రంకు (టన్నెల్), పాలేరు లింకు కాలువలో 60 కిలోమీటర్ల వరకు పూర్తి అయింది. మిగిలిన 125 కిలోమీటర్ల కాలువ పనులు పురోగతిలో ఉన్నాయి. మరో ఏడాది కాలంలో పనులు పూర్తికానున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో 1,600 క్యూసెక్కులు నీరు విడుదల చేయడం జరుగుతుంది. దీని ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టు 1.21లక్షల ఎకరాలకు ఆయకట్టుకు, మరో పదివేల ఎకరాలు చిన్న నీటిపారుదల చెరువుల కు నీరు అందనుంది.ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనా మంజురు చేయడం వలన ప్యాకేజీ 9 లో యాతలకుంట టన్నెల్ పూర్తి చేసి సుమారు 120 చెరువులకు డిసెంబర్ నెలలోగా నీరు ఇవ్వటం నిమిత్తం ప్రణాళికలు చేసి పనులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News