బిఆర్‌ఎస్ పార్టీ తరపున రాష్ట్రపతిని కలుస్తాం
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ బిసి నేతల సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బిసిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నది తమ డిమాండ్ అని, కరీంనగర్ సభ ద్వారా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నామని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనచారి, బిఆర్‌ఎస్ బిసి నాయకులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, ముఠా గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిఆర్‌ఎస్ బిసి నాయకలతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బిసిలను మోసం చేస్తూ వస్తుందని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున త్వరలోనే బిసి ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలవనుందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా కులగణన జరిపి, హడావుడిగా అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామనడం రాజ్యాంగ విరుద్ధం అని, 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని అసెంబ్లీలో తాము స్పష్టం చేశామని చెప్పారు.
అమలు కాదని తెలిసే కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మభ్య పెడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేస్తామనడం కొత్త డ్రామాకు కాంగ్రెస్ కుట్ర అని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీలో 42 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు అని అడిగారు.బిసిల పట్ల చిత్తశుద్ది ఉంటే.. మిగిలిన మూడు మంత్రి పదవులను బిసిలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు బిసిలు సిద్ధంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: మధుసూదనాచారి
శాసనమండలిలో బిసి బిల్లుకు తాము మద్దతు తెలిపామని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి తెలిపారు. బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అభాసుపాలవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.రాహుల్ గాంధీకి బిసిల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో బిసిలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దేశాన్ని తిరుగులేకుండా ఏలిన కాంగ్రెస్ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ కుటిలత్వాన్ని ఎండగడతామని అన్నారు. బిసిలకు రక్షణకవచంగా బిఆర్‌ఎస్ ఉంటుందని వ్యాఖ్యానించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బిసిలను మోసం చేయడం అని పేర్కొన్నారు. బిసిలకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా కాంగ్రెస్ చేయలేదని అన్నారు.