రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏక్ పోలీస్ విధానం అమలుచేయాలని కానిస్టేబుళ్లు గతంలో నిరసన తెలిపారని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏక్ పోలీసు విధానం కావాలని ఆందోళన చేసిన పదిమందిని పోలీసు ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారని అన్నారు. కానిస్టేబుళ్లు తల్లిదండ్రులకు, భార్య, పిల్లలకు దూరంగా ఉండి తెలంగాణ స్పెషల్ పోలీసులు పని చేశారని అన్నారు. స్పెషల్ పోలీసులకు నెలకు ఎనిమిది రోజులు లీవ్ ఉండేదని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నెలకు నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తామని చెప్పారని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కానిస్టేబుల్స్‌ను పిలిపించి మాట్లాడలేదని, ఎలాంటి విచారణ లేకుండా పదిమంది స్పెషల్ కానిస్టేబుళ్లను డిస్మిస్ చేశారని ఆరోపించారు.
పోలీసు శాఖ మిగతా శాఖలకంటే విభిన్నంగా పనిచేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. డిస్మిస్ అయిన పదిమంది కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదని, పోలీసు ఉన్నతాధికారులను దూషించలేదని అన్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 39 మంది స్పెషల్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో 50 వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. స్పెషల్ కానిస్టేబుల్స్ శ్రీమంతులు కాదన్న ఆయన పది కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. తెలంగాణ పోలీసు శాఖకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, కమాండ్ కంట్రోల్ రూమ్ ను కేసీఆర్ హయాంలోనే కట్టారని అన్నారు. కానిస్టేబుళ్లను ముందుపెట్టి రాజకీయాలు చేయాలనే ఆలోచన బిఆర్‌ఎస్‌కి లేదని అన్నారు.
డిస్మిస్ అయిన కానిస్టేబుళ్ల కుటుంబాలు కేటీఆర్ కలిస్తే తప్పు ఏమిటి..?
ప్రభుత్వం డిస్మిస్ చేసిన కానిస్టేబుళ్ల కుటుంబాలను కేటీఆర్ కలిస్తే తప్పు ఏమిటని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రూల్స్ ఎగ్జామిన్ చేసి డిస్మిస్ చేసిన పదిమంది స్పెషల్ కానిస్టేబుళ్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్పెషల్ కానిస్టేబుల్స్‌పై ఎక్కడ క్రిమినల్ కేసులు బుక్ కాలేదని, రేవంత్ రెడ్డి ప్రతిదాన్ని రాజకీయకోణంలో చూడవద్దని హితవు పలికారు. గర్భిణీ స్త్రీలు సైతం స్పెషల్ కానిస్టేబుల్స్ కోసం రోడ్డు ఎక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సమస్యలు ఉన్న ప్రతి ఉద్యోగి తెలంగాణ భవన్‌కు రావాలని ఆయన కోరారు.