ముంబై: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దాదాపు 17 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసులో నిందితులుగా ఉన్న బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు గురువారం(జూలై 31) నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు నిర్దోషులేనని చెప్పింది. నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని.. పేలుడులో వాడిన బైక్ సాధ్వి ప్రజ్ఞాకు చెందినదిగా నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ తోపాటు మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి నిందితులుగా ఉన్నారు.
సెప్టెంబర్ 29, 2008న ముంబై నుండి 200 కి.మీ దూరంలో ఉన్న మాలేగావ్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్‌కు బాంబ్ అమర్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS).. 2011లో NIAకి బదిలీ చేసింది. దీంతో దర్యాప్తు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపిన తర్వాత 2018లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. నవరాత్రి పండుగకు ముందు, పవిత్ర రంజాన్ మాసంలో ఈ పేలుడు జరిగిందని, ముస్లిం సమాజంలోని ఒక వర్గంలో భయాందోళనలు సృష్టించడమే నిందితుల ఉద్దేశమని NIA ఎత్తి చూపింది. నిందితులకు తగిన శిక్ష విధించాలని కోర్టును కోరింది. అయితే, మోటర్ సైకిల్ అక్కడికి ఎలా వచ్చిందో? కనిపెట్టలేక పోయారని.. ఈ కేసులో ఆధారాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని.. ఏడుగురు నిందితులను కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.