భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం నాడు ప్రకటించింది. జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రకటన విడుదలైంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7న జారీ అవుతుంది. ఆగస్టు 21న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. ఆగస్టు 22న నీమినేషన్లను పరిశీలిస్తారు. ఆగస్టు 25వ తేదీ వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరుగుతుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసిన ఫలితాన్ని ప్రకటిస్తారు. 1952 రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల చట్టం, రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ ఉపరాష్ట్రపతి పదవి ఏ కారణంగా
నైనా ఖాళీ అయిన పక్షంలో వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంది.ఈ ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరిలో 233 మంది ఎన్నికైన వారు, 12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, 543 మంది ఎన్నికైన లోక్ సభ సభ్యులు ఉన్నారు.రాజ్యసభలో ఐదు ఖాళీలు, లోక్ సభలో ఒక ఖాళీ కారణంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య 782కు చేరుకుంది. ఒక సభ్యుడికి ఒక ఓటు ఉంటుంది. ప్రతి ఓటుకూ సమాన విలువ ఉంటుంది. ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా నిర్వహించబడతాయి.