Sunday, August 3, 2025

ఒబిసిలకు దామాషా కోటా ఎప్పుడో?

- Advertisement -
- Advertisement -

ప్రజల భాగస్వామ్యం కాకుండా, ప్రజల కోసం కొంత మందితో ఏర్పడే ప్రభుత్వం కొందరిని పాలకులుగా, ఇతరులను పాలితులుగా తయారు చేయడం ఖాయం. ప్రజాస్వామ్య ప్రయోజనం దృష్టా ఈ పరిణామానికి స్వస్తి చెప్పాలి. నిర్దిష్టంగా చెప్పాలంటే ప్రజలు కేవలం ఓటర్లుగానే ఉండిపోరాదు. శాసన కర్తలు కావాలి. లేని పక్షంలో శాసన కర్తలు అయిన వారు ఓటర్లకు యజమానులవుతారు’ బాబా సాహెబ్ అంబేద్కర్ 1919లో సౌత్ బరో (South Baroush) కమిటీ ముందు వెలిబుచ్చిన అభిప్రాయమిది. భారతదేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించిన కమిటీ సౌత్ బరో. ఆ కమిటీ ఎన్నికల నిర్వహణ, నియోజక వర్గాల ఏర్పాటు, ఓటర్ల అర్హత లాంటి అనేక అంశాలను పరిశీలించి నిర్ణయాలు చేయడానికి ఉద్దేశించింది.

ఈ కమిటీ ముందు అనేక సంఘాలు, సంస్థలు, వ్యక్తులు హాజరై తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందులో భాగంగానే డాక్టర్ భీం రావు అంబేద్కర్ సుదీర్ఘమైన నివేదికను( Dr. Bhim Rao Ambedkar report) అందించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 28 సంవత్సరాలు. అమెరికాలో తన చదువు ముగించుకొని వచ్చిన వెంటనే ఆయన హాజరైన మొట్టమొదటి కార్యక్రమం కూడా. అంతేకాకుండా, అప్పటి వరకు ఓటు హక్కు గురించి మాత్రమే చర్చ జరుగుతున్నది. అది కూడా ఉన్నత వర్గాలు ప్రత్యేకించి ఉన్నత హోదా, ఉన్నత ఆదాయ వర్గాలు మాత్రమే పాల్గొనేలా నిర్ణయాలు జరిగాయి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటర్ల అర్హతపై కూడా చాలా స్పష్టమైన అభిప్రాయం చెప్పారు. కేవలం ఆదాయ వర్గాలు, హోదాలు కలిగిన వాళ్లకు మాత్రమే కాకుండా సార్వత్రిక ఓటు హక్కు ఉండాలని వాదించారు. దానితో పాటు, ఎన్నికల్లో పోటీ విషయంలో కూడా అన్ని వర్గాలకు అవకాశం కల్పించే విధంగా చర్యలు ఉండాలని కమిటీ ముందు వాదించారు.

ఆనాడు అంటరాని కులాలకు సంబంధించి ఆయన తన వాదనను నివేదించిన సందర్భంగా ఆయన కొన్ని వివరాలను, సార్వత్రిక సత్యాలను వివరించారు. అందులో భాగంగానే ఈ పైన పేర్కొన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అందుకోసం తెలంగాణలో కుల గణనను చేపట్టింది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుసార్లు ప్రకటించారు. వెనుకబడిన కులాలకు గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. కాని అది 27 శాతం మాత్రమే. కాని ప్రస్తుతం దానిని 42 శాతంగా ప్రకటించడం విశేషం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం సమంజసంగా లేదు.

రాష్ట్రంలోని బిజెపి ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నామని చెపుతూనే రెండో వైపు కేంద్రం అనుమతి ఇవ్వడంలో చూపుతున్న జాప్యం రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రయత్నం స్థానిక సంస్థలకే పరిమితం కాకూడదు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం ఉండాలని పదే పదే తన ప్రసంగాలలో వ్యక్త పరుస్తున్నారు. దీని కొనసాగింపుగానే స్థానిక సంస్థలతో పాటు, శాసన వ్యవస్థలో పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఎస్‌సి, ఎస్‌టిలతో పాటు, ఒబిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం కోసం కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయం పార్లమెంటు మాత్రమే తీసుకోగలదు. మన రాజ్యాంగం ప్రకారం అటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.

స్థానిక సంస్థలలో ఎస్‌సి, ఎస్‌టిలతోపాటు ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడం, వారి జనాభాకు అనుగుణంగా శాతాన్ని పెంచడం సరియైనదే. అయితే స్థానిక సంస్థలు చట్టసభలు కావు. శాసనాలు చేసే వేదికలు కావు. శాసనాలు చేసే వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటాయి. భారత దేశం స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి 75 సంవత్సరాల కాలంలో చట్టసభల్లో ప్రత్యేకించి లోక్‌సభ, శాసన సభల్లో కొన్ని కులాలకే అధిక ప్రాతినిధ్యం ఉన్న వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ప్రజాస్వామ్య నిర్వచనం అనగానే అందరికీ అబ్రహాం లింకన్ మాటలే గుర్తొస్తాయి. ప్రభుత్వం, పాలన, అధికార కార్యకలాపాలకు సంబంధించి ఆ నిర్వచనమే ప్రామాణికం అనడంలో సందేహం లేదు. “ప్రజల చేత ప్రజల కోసం పని చేసే ప్రజల ప్రభుత్వ పాలనా విధానమే ప్రజాస్వామ్యం” అన్న మాటలను మనం కొంత విశ్లేషించి చూడాలి.

ఈ వ్యాసం మొదట్లో బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రజలు కేవలం ఓటర్లుగానే కాకుండా శాసనకర్తలుగా ఉండాలని బాబా సాహెబ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అయితే భారత దేశంలో ప్రజలు ఇతర దేశాలలో లాగా సామాజికంగా ఏకీకృతమైన సమూహం కాదు. భారత దేశం సమాజం కులాల సమాహారం. కేవలం సామాజిక విభజన మాత్రమే కాకుండా వివక్షతో కూడిన విపరీత సమాజం. ఇక్కడ హోదా, డబ్బు అన్ని కూడా కులం తర్వాతనే. అందువల్లనే ఆ ప్రాతిపదిక మీదనే ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లకు అవకాశం ఇచ్చారు. అయితే ఇది అంతకు ముందు ఏర్పడిన 1935 భారత చట్టంలో కూడా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ బరో కమిటీ మొదలుకొని అండన్ రౌండ్ టేండ్ సమావేశాల దాకా జరిపిన నిరంతర పోరాటం వల్ల అవి సాధ్యమయ్యాయి.

కుల వ్యవస్థలో ఉన్న నిచ్చెనమెట్ల విధానం కిందిస్థాయిలో ఉన్న కులాలు పైకి ఎగబాకే అవకాశం లేదు. దాని వల్ల ఆర్థిక, రాజకీయ రంగాల్లో చాలా కులాలు ఎదగలేకపోయాయి. రాజ్యాంగంలోని హక్కులను అందుకోలేకపోతున్నాయి. దానిని సరిచేయాలంటే అన్ని వర్గాల, కులాల ప్రజలు అన్ని రంగాల్లో ప్రత్యేకించి పరిపాలనలో శాసన కర్తలుగా మారాలి. దానికి మార్గం చట్టసభల్లో ఒబిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. అది జరగనంత కాలం అబ్రహాం లింకన్ నిర్వచనం పాక్షిక సత్యం మాత్రమే అవుతుంది. అది ప్రజల చేత, ప్రజల ప్రభుత్వం కాదు. అది ప్రజల కోసం మాత్రమే అని ప్రకటించుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అదే విధంగా అదే సౌత్ బరో కమిటీ నివేదనలో బాబా సాహెబ్ అంబేద్కర్ “అందరి తరపున కొందరు పరిపాలించే విధానం ప్రజాస్వామ్యం కాబోదు” అని నిక్కచ్చిగా ప్రకటించారు.

ప్రస్తుతం లోక్‌సభలో వివిధ కులాల సామాజిక వర్గాల ప్రాతినిధ్యం పరిశీలిస్తే మనకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనం అర్థం కాగలదు. భారతదేశం మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543. అందులో ఆధిపత్య కులాలు 214 మంది, ఒబిసిలు 138 మంది, ముస్లింలు 24, సిక్కులు 13 మంది. అంటే దాదాపు 50 శాతం పైగా ఉన్న ఒబిసిలు కేవలం 25.4 శాతం మాత్రమే ఉన్నారు. అదే విధంగా 15 శాతం ఉండాల్సిన ఆధిపత్య కులాలు 43 శాతం ఉన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు తమ జనాభా శాతానికి అనుగుణంగా ఉన్నారు. వెనుకబడిన కులాలు అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఒబిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ పార్టీలను అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పడు మాత్రమే ప్రజాస్వామ్య నిర్వచనం సంపూర్ణ సత్యం కాగలదు.

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News