లక్నో: ప్రియురాలితో కలిసి ఉండేందుకు భార్యను చంపి అనంతరం దారి దోపిడిదారులు దాడి చేయడంతో చనిపోయిందని పోలీసులను నమ్మించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాయ్ బరేలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బదౌన్ జిల్లాలో సరన్(38), తన భార్య అమరావతి కలిసి జీవిస్తున్నాడు. సరన్‌కు మన్నత్ అనే ప్రియురాలు ఉంది. మన్నత్‌ను అతడు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. భర్తతో కలిసి ఉండాలని మన్నత్ బలవంతం చేయడంతో అమరావతిని చంపాలని భర్త నిర్ణయం తీసుకున్నాడు. జులై 30న పూర్ణగిరికి భార్యను తీసుకెళ్లాడు. మోతీపూర్‌లోని తన భావ ఇంటికి భార్యను తీసుకెళ్లి బైక్ తో పాటు పదునైన ఆయుధాన్ని కొనుగోలు చేశాడు.
అక్కడి నుంచి సొంతూరుకు వెళ్తుండగా కంత్రి గ్రామ శివారులో భార్యను చంపేసి అనంతరం ఆమెపై బంగారు ఆభరణాలను, పది వేల రూపాయలను పొదల్లో దాచాడు. అనంతరం తన స్నేహితుడు అనిల్ యాదవ్, భావకు అంబులెన్స్ కావాలని ఫోన్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. తమపై నలుగురు దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు, పది వేల రూపాయలు ఎత్తుకెళ్లారని పోలీసులకు భర్త వివరించాడు. దుండగుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులు అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్యలో మన్నత్ హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.