ఢిల్లీ: స్వాతంత్య్ర సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంగ్లేయులను దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రశంసించారు. ఢిల్లీలోజరుగుతున్న కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రెండు చెంప దెబ్బలు కొట్టయినా వక్ర మార్గంలో ఉన్న నేతలను దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్, జెడి, బిజెపి, ఆర్‌జెడి, టిఎంసి, డిఎంకె, అన్నాడిఎంకెతో ఏ పార్టీ అయినా స్వాత్రంత్యం తరువాతే వచ్చాయని తెలియజేశారు. దేశంలో సామాజిక న్యాయం, దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కూర్చీలో… ఓడితే ఇంట్లో కూర్చుంటాయని, ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్న పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించడంలేదని, దేశానికి మార్గదర్శనం కోసం మనుసింఘ్వీ నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్పవిషయమన్నారు. సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శలు చేస్తున్నారని, 140 ఏళ్ల క్రితమే ప్రజల స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ కదం తొక్కిందన్నారు. ఆంగ్లేయులను ఓడించి దేశ స్వాతంత్య్రానికి కాంగ్రెస్ కృషి చేసిందని తెలియజేశారు. దేశం నుంచి తీవ్రవాదులను పారద్రోలేందుకు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశం కోసం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారని ప్రశంసించారు. యుపిఎ 1 సమయంలో సోనియా గాంధీని ప్రధాని కావాలని అందరూ కోరారని, ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారన్నారు.